భారత్–వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ రెండో రోజు ఆటలో టీమిండియా రాణించింది. అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ సిరీస్‌లో, మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు 44.1 ఓవర్లలో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. జస్టిన్ గ్రీవ్స్ (32), షై హోప్ (26), రోస్టన్ చేజ్ (24) మాత్రమే కొంత ప్రతిఘటించగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు పరుగుల వర్షం కురిపించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 128 ఓవర్లలో 448/5 చేసి 289 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ముఖ్యంగా ఒకే రోజు ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం ప్రత్యేకతగా నిలిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ఆటతీరుతో మెప్పించారు.
కేఎల్ రాహుల్ 190 బంతుల్లో 100 పరుగులు చేసి తన 11వ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. తన కూతురు కోసం ప్రత్యేకంగా విజిల్ వేస్తూ సంబరాలు జరుపుకున్నాడు. ధ్రువ్ జురేల్ 210 బంతుల్లో 125 పరుగులతో క్రీజ్‌లో అదిరిపోయాడు. రిషభ్ పంత్ గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. రవీంద్ర జడేజా 176 బంతుల్లో 104* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
EMOTIONAL CELEBRATION BY KL RAHUL…!!! 🥺❤️
— Johns. (@CricCrazyJohns) October 3, 2025
– The best Test Opener Currently in Cricket. pic.twitter.com/hzxXAkzT3C
జడేజా–జురేల్ జోడీ 5వ వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రెండో రోజు ముగిసే సమయానికి క్రీజ్‌లో జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ శక్తి మరోసారి రుజువైంది. ఒకే రోజు ముగ్గురు సెంచరీలు బాదడంతో వెస్టిండీస్ జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది.





