HomeMovie News Teluguప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..

ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..

భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. 1941 జూలై 17న జన్మించిన భారతీరాజా, తమిళ సినీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. గ్రామీణ నేపథ్యంలో కథలను సహజత్వంతో తెరకెక్కిస్తూ ప్రత్యేకమైన ముద్ర వేశారు.

1977లో విడుదలైన ‘16 వయతినిలే’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన, అనంతరం కిజక్కే పోగుమ్ రైలు, సిగప్పు రోజక్కల్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తమిళ సినిమాకు కొత్త దిశను చూపించిన దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నారు. తెలుగులో కూడా భారతీరాజా తనదైన ముద్ర వేశారు. కొత్త జీవితాలు చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, తర్వాత సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. ముఖ్యంగా సీతాకోకచిలుక సినిమాకు నంది అవార్డు లభించింది.

గ్రామీణ జీవన శైలిని, మట్టివాసనను వెండితెరపై సహజంగా ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను 2004లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ భారతీరాజా మంచి గుర్తింపు పొందారు. తమిళంలో అనేక చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

చివరిసారిగా ధనుష్ నటించిన వాతి చిత్రంలో ఆయన కనిపించారు. ఆ సినిమాలో తాత పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా మరణ వార్తతో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలు విషాదంలో మునిగిపోయాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular