HomeTeluguపెద్ది మూవీ రివ్యూ & రేటింగ్

పెద్ది మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: పెద్ది
దర్శకత్వం: బుచ్చి బాబు సానా
కథ – రచన: బుచ్చి బాబు సానా

నటీనటులు: రామ్‌చరణ్‌, శివరాజ్‌కుమార్‌, జాన్వీకపూర్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ, రవి కిషన్‌ తదితరులు,

నిర్మాతలు: వెంకట సతీశ్‌ కిలారు, ఇషాన్‌ సక్సేనా

సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు
ఎడిటర్: నవీన్‌ నూలి

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్

విడుదల తేదీ: 04 జూన్ 2026

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా. ఫస్ట్ సినిమాతోనే గురువుకి తగ్గ శిష్యుడి అనిపించుకుని నేషనల్ అవార్డు అందుకుని, రెండో సినిమాకి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. చెర్రీ లాంటి స్టార్ హీరోని ఎంచుకుని బుచ్చి బాబు కూడా పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కావటం, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక స్పెషల్ రోల్ చేస్తుండటం పెద్ది పై అంచనాలని మరింత పెంచింది . వీటన్నిటికీ తగ్గట్టే రిలీజ్ చేసిన గ్లింప్స్ , ట్రైలర్ , సాంగ్స్ అన్ని ఆకట్టుకున్నాయి. పెద్ది కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. జూన్ 4 న పెద్ది వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. పెద్ది సినిమా అంచనాలను అందుకుందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

విజయనగరం జిల్లాలో ఒక ఊరు ఉంటుంది. కానీ ఆ ఊరుకి పేరు ఉండదు. పేరు లేని ఊరు ఉండటం విచిత్రమే. కారణం కొండ కింద ఉంటుంది ఆ ఊరు. వందల మంది అక్కడ నివసిస్తున్న ప్రభుత్వ రికార్డుల్లో ఆ ఊరికి గుర్తింపు ఉండదు. పేరు లేని ఊరు కావటం తో అక్కడి మనుషులకి కూడా పెద్దగా గుర్తింపు ఉండదు. అందరూ ఆ ఊరి మనుషులని చులకనగా చూస్తూ ఉంటారు. ఆ ఊళ్లోనే పెద్ది (రామ్‌చరణ్‌) కూడా పుట్టి పెరుగుతాడు. సొంత ఊరి నుంచి రోజూ విజయనగరం వెళ్లి కూలి పనులు చేసుకుంటుంటాడు. పెద్ది కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నా క్రీడల్లో మంచి నైపుణ్యం ఉంటుంది. ముఖ్యంగా పెద్ది క్రికెట్‌లో రాటు దేలిన ఆటగాడు. ఎంతలా అంటే ఒక ఓవర్ లో ఉండే సిక్స్ బాల్స్ కి అన్నీ సిక్స్ లు కొట్టే ఆటగాడు పెద్ది. అందుకే విజయనగరం, బొబ్బిలి క్రికెట్ టీమ్స్ పెద్ది కోసం పోటీపడుతుంటాయి. ముద్దుగా పెద్ది ని అంతా ఆట కూలీ అని పిలుస్తుంటారు. క్రికెట్ లో ఇంత ప్రావీణ్యం ఉన్న పెద్ది అనుకోకుండా క్రికెట్ వదిలి కుస్తీ వైపు అడుగేస్తాడు. పెద్ది కథ ఏంటి ? తన ఊరికోసం పెద్ది చేసిన పోరాటం ఏంటి ? ఆ పోరాటం లో పెద్ది ఏం కోల్పోయాడు? ఏం సాధించాడు? పెద్ది ప్రయాణంలో అప్పలసూరి (జగపతిబాబు), గౌర్‌నాయుడు (శివరాజ్‌కుమార్‌) ల పాత్రలు ఏంటి?పెద్ది లో అచ్చియమ్మ (జాన్వీ కపూర్) పాత్ర ఏంటి ? క్రికెట్ నుంచి కుస్తీ కి మారిన పెద్ది కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

గత ఏడాది చెర్రీ నుంచి వచ్చిన ‘గేమ్ చెంజర్’ మూవీ సినీప్రియులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే పెద్ది పై చెర్రీ ఫాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. చరణ్ కూడా పెద్ది కోసం బాగా కష్టపడ్డాడని తెలుస్తోంది. చెర్రీ బాడీ బిల్డింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చెర్రీ లాంటి పాన్ ఇండియా స్టార్ ఒక సినిమా చేస్తున్నాడు అనగానే పక్కా కమర్షియల్ సినిమా అనుకుంటారు అంతా. కానీ పెద్ది పూర్తి భిన్నంగా ఉంది. ఈ విషయాన్ని ప్రమోషన్స్ లో బుచ్చి బాబు కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. కేవలం పాటల్లోనే కమర్షియాల్టీ కనిపిస్తుంది తప్ప కథలో ఎలాంటి కమర్షియల్ హంగులు లేవు. ఇలాంటి కథకి చెర్రీ ఓకే చెప్పటం గ్రేట్ . చెర్రీ కున్న ఇమేజ్ కి స్టార్ దర్శకులు క్యూ కడుతున్నా బుచ్చి బాబుకి చెర్రీ ఛాన్స్ ఇవ్వటం గొప్ప విషయం. 2016 ఒలింపిక్స్ ముగింపు తర్వాత నుంచి పెద్ది కథ మొదలవుతుంది. కోల్‌కతా నుంచి మొదలైన ఈ కథ విజయనగరం మీదుగా కొండ కింద ఊరికి వస్తుంది. క్రీడా శాఖలో పనిచేసే బోమన్ ఇరానీ, క్రీడా స్ఫూర్తిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ఎక్కువగా పెద్ది పేరు వింటాడు. ఇందరు చెప్తున్నపెద్ది ఎవరో తెలుసుకోవటానికి బోమన్ ఇరానీ ఆసక్తి చూపిస్తాడు. అక్కడనుంచి పెద్ది పరిచయం మొదలవుతుంది.

ఫస్టాఫ్ పెద్ది పరిచయం, పెద్ది క్రికెట్ మెళుకువలు, చూపిస్తూ క్రికెట్ నుంచి కుస్తీ వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆసక్తికరంగా చూపించారు. ఫస్టాఫ్ కొంచెం స్లో గా ఉన్నా ప్రీ-ఇంటర్వెల్ నుంచి స్పీడ్ అందుకుంది. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్ట్ గా సాగి సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి. బుచ్చి బాబు రాసుకున్న స్క్రీన్‌ ప్లే చాలా బాగుంది. కుస్తీ కోసం చరణ్ ఢిల్లీ వెళ్లడం, కుస్తీ సీన్స్ అన్నీ ప్రేక్షకులని కథలో ఇన్వాల్వ్ అయ్యేలా ఆసక్తి గా రాసుకున్నాడు. క్రికెట్ , కుస్తీ తో పాటు పెద్ది ఇంకో ఆట వైపు కూడా వెళ్లాల్సిన పరిస్థితులను చాలా ఎమోషనల్ గా మలిచాడు దర్శకుడు. క్రికెట్ హిస్టరీ లో ఎవరు ఇప్పటివరకు చూడని కొత్త షాట్స్ ని పరిచయం చేసారు చరణ్, బుచ్చి బాబు. హీరోయిన్ ఎంట్రీ, ఆమె రాజకీయ ఎత్తుగడలు, కొంచెం సైడ్ ట్రాక్ అయ్యినట్టు ఉంటుంది. అప్పలసూరి ఉన్న సీన్స్ కథకి మంచి ఎమోషన్స్ తీసుకుని వచ్చాయి.

పెద్ది పోరాటం, డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కమర్షియల్ కథలకి పెద్ద పీట వేస్తున్న ఈ రోజుల్లో, ఇలా క్రీడా నేపథ్యంతో యువతలో స్ఫూర్తిని నింపే కథ ని చెర్రీ ఎంచుకోవటం గ్రేట్ అని చెప్పాలి. గుర్తింపు కోసం ఒక క్రీడాకారుడు చేసే పోరాటమే ‘పెద్ది’. పుట్టి పెరిగిన ఊరికి, అక్కడ మనుషులకూ గుర్తింపు తేవటమే లక్ష్యంగా పెద్ది ప్రయాణం సాగుతుంది. ఆ గుర్తింపు కోసం పెద్ది ఎంత దూరం వెళ్లాడు? రెండు ఆటల్ని కలిపి ఆడే క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా ఎలా మారాడన్నది ఆసక్తిగా చిత్రించాడు దర్శకుడు బుచ్చి బాబు. మితిమీరిన హీరోయిజం, ఎలివేషన్స్‌ లేకపోయినా , కేవలం కథపై నమ్మకంతో చెర్రీ పెద్ది చేసాడని, చెర్రీ నమ్మకం వమ్ము కాలేదని అనిపిస్తుంది. గుర్తింపు లేని ఓ ఊరి కథని, అక్కడ పుట్టి పెరిగి తరువాత తరాలకు స్ఫూర్తి నింపిన ఓ క్రీడాకారుడి ప్రయాణాన్ని తెరపై గొప్పగా ఆవిష్కరించాడు బుచ్చిబాబు. క్రీడా నేపథ్యం ఉన్న కథలు స్టార్ హీరోలు చేయటం చాలా అరుదు. చెర్రీ మొదటి స్టెప్ వేసాడు. పెద్ది లో ఉన్న కొన్ని క్రీడా ఎలివేషన్స్ కథలో భాగంగానే అనిపిస్తాయి తప్ప కావాలని కథకి అతికించినట్టు ఉండవు. కుస్తీ నేపథ్యంలో వచ్చే సీన్స్ కంపోజ్ చేసిన విధానం బాగుంది. క్రాస్ ఓవర్ అథ్లెట్ నేపథ్యం గురించి పరిచయం చేస్తూ , క్రికెట్‌నీ, కుస్తీని కలిపి చరణ్ చేసే విన్యాసాలు ఆడియన్స్ ని మెప్పిస్తాయి. కుస్తీ నేపథ్యంలో వచ్చిన సీన్స్, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి. ఆట నుంచి ఆట కి మారే క్రమంలో పెద్ది ఏ ఆటనైనా క్షణాల్లో అంది పుచ్చుకుంటాడని డైలాగ్‌తో జస్టిఫై చేసారు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా సెకండ్ హ్యాఫ్ కేవలం కథపైనే దృష్టిపెట్టాడు. పెద్దిలో కొన్ని మైనస్ లున్నాయి కానీ ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సినిమాలో అవన్నీ పెద్ద లోతుగా కనిపించవు.

నటీనటులు :

రంగస్థలం సినిమాలో చరణ్ నట విశ్వరూపం చూసిన ఆడియన్స్ పెద్ది లో చరణ్ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ చూసి షాక్ అయ్యారు. చెర్రీ ఈ కథకి అసలైన హీరో అని చెప్పొచ్చు. కథకి తగట్టు తనని తాను మలుచుకున్న తీరు అద్భుతం. చెర్రీ తెరపై కనిపించినప్పుడు ఈ పాత్ర కోసం పడ్డ కష్టం తెలుస్తోంది. క్రికెట్, కుస్తీ లాంటి ఆటల్లో చెర్రీ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంది. చెర్రీపై ఉన్న అభిమానం, గౌరవం ఈ సినిమాతో రెట్టింపవు అవుతాయనటం లో సందేహం లేదు. మూడు ఆట నేపథ్యాలని ఒకే సినిమాలో చూపించటం, వాటిలో చెర్రీ రాటుదేలిన విధానం సూపర్. ఈ కథకి చెర్రీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసాడు. చెర్రీని తప్ప ఈ పాత్రలో ఇంకొకరని ఊహించలేము. చెర్రీకి ఈసారి నేషనల్ అవార్డు పక్కా అని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అచ్చియమ్మగా నటించిన జాన్వీ కపూర్ పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. గ్లామర్ తో కనువిందు చేసింది. దేవర తర్వాత జాన్వీ తెలు గులో చేసిన సినిమా ఇదే. పెద్ది తరువాత కమర్షియల్ సినిమాల్లో జాన్వీ కి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. జగపతి బాబు చేసిన అప్పలసూరి పాత్ర కథకి మరో హైలెట్. అప్పలసూరి పాత్రలో జగపతిబాబు పరకాయ ప్రవేశం చేశారు. ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుంచి విలన్‌గా మారిన జగపతిబాబు అప్పలసూరి పాత్రతో మళ్ళీ ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నారు. దివ్యేందు శర్మ పాత్ర చిన్నదే అయినా నటనతో మెప్పించాడు. శివ రాజ్‌కుమార్ పాత్ర కూడా స్పెషల్ గా ఉంది. మిగతా నటీ నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్:

‘పెద్ది’ కి ఇంకో హీరో దర్శకుడు బుచ్చి బాబు. క్రీడా స్ఫూర్తి నింపే కథని రాసుకున్న తీరు అంతే నిజాయితీగా ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. టెక్నికల్ టీం కూడా పెద్ది కథకి హైలెట్ అయింది. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. రత్న వేలు సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. పీరియాడిక్ సెటప్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ట్రాన్సిషన్ షాట్స్ ని రత్నవేలు ది బెస్ట్ అనిపించేలా డిజైన్ చేశారు. ఎడిటింగ్ విషయంలో ఇంకొంత శ్రద్ద పెడితే బాగుండేది.నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

రామ్ చరణ్
జగపతి బాబు
కథ , కథనం
పాటలు

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ సాగదీత
హీరోయిన్ రోల్

You May Like This
- Advertisment -spot_img

Most Popular