చిత్రం: గోదారి గట్టుపైన
దర్శకత్వం: సుబాష్ చంద్ర
కథ – రచన: సుబాష్ చంద్ర
నటీనటులు: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతిబాబు, లైలా, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, శ్రీవాణి, సుదర్శన్, రాజకుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు
నిర్మాతలు: అభినవ్ రావు
సంగీతం: నాగవంశీ
సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్
ఎడిటర్: P. అనిల్ కుమార్
బ్యానర్: రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 08 మే 2026
ఐక్లిక్ న్యూస్ రేటింగ్: 2.25/5
‘మేం ఫేమస్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ ప్రభాస్. మొదటి సినిమాతో పరవాలేదనిపించుకున్న ఈ హీరో లాంగ్ గ్యాప్ తరువాత ఇప్పుడు ‘గోదారి గట్టు పైన’ అనే సినిమాతో ఈ వారం థియేటర్స్ లో సందడి చేయటానికి వచ్చాడు. పెద్ద సినిమాలు లేకపోవటం తో చిన్న సినిమాలు ప్రతివారం బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మొదటి నుంచి గోదారి గట్టుపైన సినిమాకి పాజిటీవ్ బజ్ ఏర్పడింది. కారణం గోదావరి తీర ప్రాంతలో తెరెకెక్కుతున్న కథా నేపథ్యం కావటం, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ని లవ్ స్టోరీ కి ముడిపెట్టి తీయటమే. పైగా ప్రమోషన్స్ కూడా కమర్షియల్ యాడ్స్ తరహాలో చేసారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల మనసులు దోచుకుందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
భీమవరం దగ్గర ఓ ఊరిలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు శ్యామ్ బాబు (జగపతిబాబు). అతనికి కూతురు మాయ (నిధి ప్రదీప్) అంటే పంచ ప్రాణాలు. కూతురు సంతోషమే తన సంతోషంగా జీవిస్తుంటాడు. అలాంటి మాయ లైఫ్ లోకి ఆటో డ్రైవర్ రాజు (సుమంత్ ప్రభాస్) ఎంటర్ అవుతాడు. రాజు చాలా మంచివాడు. ఫ్రెండ్స్ తో ఆడుతూ పాడుతూ సరదాగా జీవితం గడిపేస్తుంటాడు. మాయ ని చూడగానే రాజు ప్రేమలో పడిపోతాడు. తండ్రే లోకంగా బతికే మాయ కూడా రాజు కొట్టిన ఓ చెంపదెబ్బ తో అతనితో ప్రేమలో పడిపోతుంది. కానీ గార్డ్ గా చేసే శ్యామ్ కూతురికి మంచి సంబంధం చేయాలనుకుంటాడు. రాజు కారణంగా తండ్రి కూతురు మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? వాటిని జయించి ప్రేమికులు ఇద్దరు ఒక్కటయ్యారా ? తండ్రి కూతురు మధ్యలో రాజు పరిస్థితి ఏంటి ? భిన్నమైన సామాజిక నేపథ్యాల కారణంగాఈ ప్రేమ కథకి ఎదురైన చిక్కులతో చివరకు ప్రేమ గెలిచిందా లేక తండ్రి బాధ్యత గెలిచిందా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
ఇలాంటి ప్రేమ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఇప్పటికే ఇలాంటి కథలు చాలా వచ్చాయి. కానీ ప్రేమ కథలు ఎన్నివచ్చినా యూత్ ని ఆకట్టుకుంటూనే ఉంటాయి. కారణం ప్రతి ప్రేమ కథలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. గోదారి గట్టుపైన కూడా ఇలాగే ఎదో ఒక కొత్తదనం ఉంటుంది అని ఆశిస్తే ప్రేక్షకులకి నిరాశే ఎదురయ్యింది. రొటీన్ లవ్ స్టోరీ , స్క్రీన్ ప్లె కూడా చాలా సాధారణంగా సాగింది. ప్రధానంగా ప్రేమ కథలకి అడ్డు వచ్చేది కులం, మతం. వీటి తరువాత ఆర్ధిక అంతరాలు. ఇవే ప్రేమ కథకి కావల్సినంత డ్రామాని ఎమోషన్స్ ని తెచ్చిపెడతాయి. కానీ ఈ కథలో బలమైన ఎమోషన్స్ మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో రాజు జీవితం, ఫ్రెండ్స్ , తల్లిదండ్రులు ను పరిచయం చేస్తూ కథని మొదలు పెట్టాడు దర్శకుడు. నెక్స్ట్ హీరోయిన్ మాయని పరిచయం చేశాడు.
లవ్ స్టోరీ రొటీన్ గా ఉంది. లాజిక్స్ కూడా వెతకలేము. తండ్రే లోకం గా బతికే అమ్మాయి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తండ్రి ప్రేమ ని మరచి ఓ సాధరణ అబ్బాయి ప్రేమలో పడిపోవటం చాలా సిల్లీగా ఉంటుంది. ప్రేమ గుడ్డిది అన్న నానుడికి దర్శకుడు ఇంకోసారి న్యాయం చేసాడు. రాజు మాయని చెంప దెబ్బకొట్టడం వలన అతనితో ప్రేమలో పడిపోయే అమ్మాయి కథ ఇది. ఇది ఎం లాజిక్కో జనాలకి అసలు అర్థం కాదు. ప్రేమలో పడటానికి, విడిపోవడానికి పెద్దగా కారణాలు లేని నేటి జనరేషన్ కి కూడా ఈ లాజిక్ నచ్చదేమో.
మాములుగా అమ్మాయిలు కొడితే అబ్బాయిలు ప్రేమలో పడతారు. కానీ ఇక్కడ అబ్బాయి కొడితే కారణం లేకుండా అమ్మాయి ప్రేమలో పడిపోతుంది. గోదారి గట్టుపై కథలో హీరో తండ్రి హిందువు. తల్లి ముస్లిం. హీరోయిన్ మాయ క్రీస్టియన్. ఇలా మూడు మతాల్ని తన కథలో వాడేసుకున్నాడు. కానీ కథని ఈ కులమతాలకు లింక్ చేయలేదు. జగపతి పాత్రకి ఎలివేషన్స్ ఎక్కువ ఇచ్చారు. కానీ క్యారక్టర్ తేలిపోయింది. ఇంట్రవెల్ సీన్ ఎందుకు చెప్పాడో అర్థం కావటం లేదు. సెకండాఫ్‌లో తండ్రీ కూతుర్ల ఎమోషన్స్, సంఘర్షణ మిస్ అయ్యింది. ఫైనల్ గా రాజు మంచి వాడని ఒకరు చెప్తే తండ్రి కరిగిపోయి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి రెండు గంటల కథ వేస్ట్ అనిపించారు. క్లైమాక్స్ మరీ సింపుల్ గా రోటీన్ గా ముగిసింది. రిలీజ్ కి ముందు గోదారి గట్టుపైన సినిమాకి భారీ ఎలివేషన్స్ ఇచ్చారు. మణిరత్నం, గౌతమ్ మీనన్ కథలకి లింక్ చేసి ఓవర్ హైపు ఇచ్చారు. కానీ సినిమా చూస్తే రిజల్ట్ కొండెక్కింది.
నటీ నటులు :
మేము ఫేమస్ సినిమాలో తెలంగాణ కుర్రాడిగా కనిపించిన సుమంత్ ప్రభాస్, సెకండ్ సినిమాకి గోదావరి కుర్రాడిగా నటించి గోదారి యాసతో మెప్పించాడు. సినిమాకోసం గోదారి యాస నేర్చుకుని సహజంగా నటించాడు. నిధి ప్రదీప్ ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. చిన్న సినిమాలకి నిధి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. తన అమాయకమైన నటనతో మొదటి సినిమాకే మంచి మార్కులు కొట్టేసింది. కళ్ళతోనే హావా భావాలు పలికించిన తీరు అద్భుతం. చాలా కాలం తరవాత జగపతి బాబు మధ్యతరగతి పాత్రలో కనిపించారు. లెజెండ్ తరవాత జగపతి బాబు చేసిన పాత్రలన్నీ రిచ్ లుక్ లో ఉన్నవే. చాలా రోజులకి జగ్గు మాములు పాత్రలో కనిపించారు. కానీ జగపతి పాత్ర తేలిపోయింది. నటన పరంగా జగపతిబాబుకి వంకలు పెట్టడానికి లేదు. రాజీవ్ కనకాల ఈ మధ్య బిజీగా ఉన్నారు. చిన్న సినిమాల్లో తండ్రి పాత్రల్లో అలరిస్తున్నాడు. ఓటీటీల్లో కూడా మెరుస్తున్నాడు. దేవి ప్రసాద్, శ్రీవాణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. హీరో చెల్లెలి పాత్రలో నటించిన శ్రీ లాస్య, మరదలి పాత్రలో నటించిన రేణు స్క్రీన్ మీద అందంగా కనిపించి, నటన పరంగా కూడా ఆకట్టుకున్నారు. సుదర్శన్ కామెడీ ట్రాక్ వర్కవుట్ అయింది. రాజకుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ లాంగ్ గ్యాప్ తరువాత ఫుల్ లెన్త్ రోల్స్‌లో కనిపించి నవ్వించారు.
టెక్నికల్ :
దర్శకుడు సుభాష్ సింపుల్ కథని తీసుకుని అంతే సింపుల్ గా ప్రజంట్ చేసి ప్రేక్షుకులని నిరాశ పరిచారు. కథకి స్కోప్ ఉన్నా, స్క్రీన్ ప్లే లో తడబడ్డాడు. వంశీ అందించిన సంగీతం బావుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో, స్క్రీన్ పై చూడటానికి అంతే బాగున్నాయి. గోదావరి అందాలు ఎన్ని సార్లు చూసినా కొత్తగా ఉంటాయి. బోర్ కొట్టదు . ఈ సినిమాకి కొంత గోదావరి నేపథ్యం కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రాఫర్ గోదారి అందాలని చిత్రించిన విధానం బాగుంది. ఎడిటింగ్ ఈ సినిమాకి మైనస్. ఎడిటింగ్ పై శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
గోదావరి అందాలు
సంగీతం
నటీ నటులు
కామెడీ
మైనస్ పాయింట్స్
ఎడిటింగ్
సాగదీత సీన్స్
రొటీన్ స్టోరీ
కథ కథనం
ఫైనల్ వర్దిక్ట్ : వేసవి తాపం తీర్చని ‘గోదారి గట్టుపైన’





