ప్రియదర్శి, నాగ దుర్గ ప్రధాన పాత్రల్లో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇడుపు కాయితం సినిమా టైటిల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ టైటిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. సినిమా టైటిల్‌తో పాటు తెలంగాణ యాసపై కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ కొందరు పోస్టులు పెట్టడం వివాదానికి దారితీసింది. ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల నెటిజన్ల మధ్య చర్చకు కారణమైంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ భాష, సంస్కృతిపై వస్తున్న విమర్శలపై టీజీపీఎస్సీ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ట్రోలర్లకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇడుపు కాయితం అనే పదానికి స్పష్టమైన అర్థం ఉందని, అది విడిపోయే సమయంలో రాసుకునే ఒప్పంద పత్రాన్ని సూచించే స్థానిక పదం అని ఆయన వివరించారు. అర్థం తెలియకుండా విమర్శలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.
అలాగే తెలంగాణ భాషను, స్థానిక పదాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఘంటా చక్రపాణి అన్నారు. భాషా వైవిధ్యాన్ని గౌరవించాలని సూచిస్తూ, అర్థం తెలియని విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ట్రోలర్లకు హెచ్చరించారు. ప్రస్తుతం ఘంటా చక్రపాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇడుపు కాయితం టైటిల్‌పై మొదలైన ఈ చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.





