సినీ నటి రేణు దేశాయ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అసభ్యకర కామెంట్లు చేస్తూ, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని రేణు దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రత్యేకంగా వీధి కుక్కల సమస్య వంటి సామాజిక అంశాలపై తాను స్పందించిన తర్వాత ఈ వేధింపులు మరింత పెరిగాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు డిజిటల్ ఫోరెన్సిక్ సాయంతో దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిందితులపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు కీలక హెచ్చరిక కూడా జారీ చేశారు. సోషల్ మీడియాలో అనామక ఖాతాల వెనుక దాక్కుని ఎవరినైనా దూషించవచ్చని భావించడం పొరపాటని, ముఖ్యంగా మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కొద్ది రోజుల క్రితమే రేణు దేశాయ్ ఒక వీడియో విడుదల చేస్తూ, తనను టార్గెట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఇక గతంలో యాంకర్ అనసూయ విషయంలో కూడా ఇలాంటి ఆన్‌లైన్ వేధింపులపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. తాజాగా రేణు దేశాయ్ కేసులో తీసుకున్న చర్యలు సైబర్ వేధింపుల విషయంలో పోలీసులు ఎంత సీరియస్‌గా ఉన్నారో మరోసారి అర్ధం అవుతుంది.





