స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికినట్లు సమాచారం. గత కొంతకాలంగా భర్త సోహైల్ కతూరియాతో విడివిడిగా ఉంటున్న ఆమె, తాజాగా ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ద్వారా అధికారికంగా విడాకులు పొందినట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతోనే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడంతో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం.
హన్సికా మోత్వానీ, సోహైల్ కతూరియా 2022 డిసెంబర్లో రాజస్థాన్‌లో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ పెళ్లి సినీ వర్గాల్లోనే కాకుండా మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు.
వివాహం జరిగిన కొద్ది రోజులకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రేమ వివాహం అయినప్పటికీ జీవనశైలి, వ్యక్తిత్వాల విషయంలో పొంతన కుదరకపోవడంతో తరచూ విభేదాలు ఏర్పడినట్లు సమాచారం. పెద్దలు, స్నేహితులు మధ్యవర్తిత్వం చేసినా పరిస్థితి మారలేదని అంటున్నారు.
చివరకు జూలై 2, 2024 నుంచి ఈ జంట వేర్వేరుగా జీవించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అనంతరం కలిసి జీవించడం సాధ్యం కాదని భావించి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
సెలబ్రిటీల విడాకుల సమయంలో సాధారణంగా భరణం అంశం పెద్ద చర్చకు దారితీస్తుంది. అయితే ఈ విషయంలో హన్సికా భర్త నుంచి ఎలాంటి భరణం లేదా ఆర్థిక సహాయం కోరలేదని సమాచారం. ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేకుండానే ఈ బంధం నుంచి బయటకు రావాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హన్సికా అభిమానులు, నెటిజన్లు ఈ వార్తపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇక హన్సికా కెరీర్ విషయానికి వస్తే, శాకలక బూమ్ బూమ్, కోయి మిల్ గయా వంటి హిందీ ప్రాజెక్ట్‌లతో బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. టాలీవుడ్లో దేశముదురు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హన్సికా ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా కొనసాగుతోంది.





