టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు-తమిళ సినీ పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన కత్తి కాంతారావు జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో ఆయన చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరించే క్రమంలో తమిళ ప్రజల ఆరాధ్య నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్) గురించి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ వర్గాల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఈ వ్యాఖ్యలపై తమిళ సినీ నటులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరో విశాల్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
విశాల్ తన సోషల్ మీడియా పోస్టులో మాట్లాడుతూ, తెలుగు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన మాటలు చూసి నాకు చాలా బాధ కలిగింది. సర్, మీకు ఒక విషయం చెప్పాలి. తమిళనాడులో ఎంజీఆర్ గారు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఆయన మా అందరికీ ఒక గొప్ప నాయకుడు, దైవం లాంటి వ్యక్తి అని పేర్కొన్నారు.
Shocking and repelling to see and hear the recent comments of senior actor Shri Rajendra Prasad, senior actor of our Telugu film industry at a recent function.
— Vishal (@VishalKOfficial) March 12, 2026
Dear Sir, with utmost regards and at the same time with a heavy heart, I pen down this tweet condemning your speech…
ఒక గొప్ప నటుడు కాంతారావు గారి గురించి మీరు ప్రశంసించడం మంచి విషయం. కానీ, ఒకరిని పొగిడే క్రమంలో మరో మహానుభావుడిని కించపరచడం సరైంది కాదు. ఇది తమిళ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది అని విశాల్ అన్నారు.
అలాగే, మీలాంటి సీనియర్ నటుడికి ఇలా చెప్పాల్సి రావడం బాధగా ఉంది. మీరు చేసిన వ్యాఖ్యలకు పెద్ద మనసుతో క్షమాపణ చెప్పి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని కోరుతున్నాను. భవిష్యత్తులో మీ స్థాయి ఉన్న నటులను ఎవరైనా ఇలాగే అవమానిస్తే, నేను మీ కోసమైనా అదే విధంగా స్పందిస్తాను అని ఆయన రాసుకొచ్చారు.
ప్రస్తుతం విశాల్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీస్తోంది. రాజేంద్ర ప్రసాద్ ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.





