టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండ-రష్మిక, అల్లు శిరీష్-నయనిక వివాహాలు వార్తల్లో నిలవగా, ఇప్పుడు మరో యంగ్ సెలబ్రిటీ గురించి ఆసక్తికరమైన గాసిప్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, గాయకుడు కాలభైరవ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు టాలీవుడ్లో హల్చల్ చేస్తున్నాయి.
ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, కాలభైరవ యంగ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరి పరిచయం ఉస్తాద్ సినిమా సమయంలో ఏర్పడిందని అంటున్నారు. ఆ చిత్రంలో కాలభైరవ తమ్ముడు శ్రీ సింహా హీరోగా నటించగా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా కనిపించారు. ఆ సమయంలో మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయంపై ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకారం తెలిపినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కాలభైరవ సోదరుడు శ్రీ సింహా 2024లో వివాహం చేసుకోవడంతో, ఇప్పుడు కాలభైరవ పెళ్లి కూడా త్వరలోనే జరగవచ్చని ప్రచారం సాగుతోంది.
ఇక కావ్య కళ్యాణ్ రామ్ కెరీర్ విషయానికి వస్తే, 2003లో వచ్చిన గంగోత్రి సినిమాతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి పలు చిత్రాల్లో బాలనటిగా గుర్తింపు పొందారు. తర్వాత మసూద సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
మరోవైపు కాలభైరవ గాయకుడు, సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. బాహుబలి 2 లోని దండాలయ్యా పాటతో గుర్తింపు పొందిన ఆయన, మత్తు వదలరా సినిమాతో సంగీత దర్శకుడిగా మారారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి పాడిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకోగా, అదే సినిమాలోని కొమురం భీముడో పాటకు కాలభైరవ జాతీయ అవార్డు దక్కింది.
కెరీర్లో మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవుతారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.





