HomePolitics TeluguGHMC ఎన్నికల్లో ఒంటరిగా పోటీ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

GHMC ఎన్నికల్లో ఒంటరిగా పోటీ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నిర్వహించాలనుకున్న జనసేన ‘నవ నిర్మాణ సభ’కు హైకోర్టు అనుమతి లభించకపోవడంతో ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో తనకు అధికారంపై ఆసక్తి లేదని, మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. సమాజంలో విభేదాలు సృష్టించడం తనకు ఇష్టం లేదని, అందుకే అనేక సందర్భాల్లో సంయమనంతో వ్యవహరించానని అన్నారు.

తెలంగాణకు జరిగిన అన్యాయాలపై మాట్లాడేటప్పుడు ప్రజలను కాకుండా పాలకులను ప్రశ్నించాలని పవన్ సూచించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు తాను దూరమని స్పష్టం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన జీవించి ఉన్న సమయంలో ఎంతోమంది మాట్లాడలేదని, గద్దర్ అడిగిన వెంటనే తన వంతు సహాయం చేశానని గుర్తు చేశారు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధ కలిగించిందని పవన్ అన్నారు. అయితే విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

2029 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీతో కలిసి పోటీ చేస్తామా లేదా అనేది భవిష్యత్తులో నిర్ణయిస్తామని, కానీ జనసేన మాత్రం తెలంగాణ రాజకీయాల్లో తన పాత్రను పోషిస్తుందని చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పార్టీ అభ్యర్థులు గెలవడం తనకు ముఖ్యమని పేర్కొన్నారు.

రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో జనసేన మరింత చురుకుగా వ్యవహరించనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular