ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల రామాయణం, దేశంలోని సామాజిక పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించారు.
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ఇటీవల ఒక సాహితీ కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారని అన్నారు. తాను అవతార పురుషుడు శ్రీరాముడిని అవమానించలేదని, హిందూ ధర్మాన్ని కించపరిచే ఉద్దేశం కూడా తనకు లేదని స్పష్టం చేశారు.
అన్ని మతాలను, అందరినీ గౌరవించే వ్యక్తిగా తనను పేర్కొన్న ప్రకాష్ రాజ్, ధర్మం పేరుతో మతోన్మాద రాజకీయాలు చేస్తున్న వారిని ప్రశ్నిస్తున్నందుకే తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తనపై విమర్శలు చేస్తున్నవారి ఉద్దేశం తనకు అర్థమవుతోందని, సరైన సమయంలో వారికి సమాధానం ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం తాను తోట పనుల్లో బిజీగా ఉన్నానని, అవి పూర్తయ్యాక మాట్లాడతానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వీడియోను విడుదల చేశారు.
సదరు కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చారని, దక్షిణాదిలో గిరిజనుడైన రావణుడి పొలంలోకి వెళ్లి పండ్లు తిన్నారని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై పలు వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ వ్యవహారంపై టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ప్రకాష్ రాజ్‌కు పరువు నష్టం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
మొత్తానికి, ప్రకాష్ రాజ్ ఇచ్చిన తాజా వివరణతో ఈ వివాదం ముగుస్తుందా? లేక మరింత ముదురుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
To all the desperate bigots #justasking pic.twitter.com/zGLpbEOcYp
— Prakash Raj (@prakashraaj) April 19, 2026





