తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కవిత మూడు రంగుల చీర ధరించి రావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కూడా పాల్గొని కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు.
అయితే.. కవిత ధరించిన చీరలో కాంగ్రెస్ పార్టీ రంగులు ఉన్నాయనే కారణంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్లు ట్రోలింగ్ ప్రారంభించాయి. “ఉదయం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించి, సాయంత్రం కాంగ్రెస్ మంత్రివారి ఇంట్లో వేడుకకు? అదేంటి?” అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు. కొందరు అయితే కవిత కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే సంకేతమా? అని వ్యంగ్యంగానూ పోస్టులు చేస్తున్నారు.
Nice Saree Akka 🙏 all colors are covered 👏 pic.twitter.com/oUHhMG4ETU
— Srinivas Potti (@SrinivasBRSUSA) November 27, 2025
ఇక ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, కవిత తన తండ్రి కేసీఆర్‌కు పార్టీ వ్యవహారాలపై రాసిన లేఖ లీక్ కావడంతో పెద్ద వివాదమే జరిగింది. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో, ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ప్రస్తుతం జాగృతి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కొత్త పార్టీ పెడతారన్న వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు అలాంటి ఆలోచన లేదని కవిత స్పష్టం చేశారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మధ్య, కవితపై బీఆర్ఎస్ ట్రోలింగ్ తగ్గడం లేదు. ఇప్పుడు చీర రంగుల వ్యవహారం కూడా సోషల్ మీడియాలో వేడెక్కింది.





