ప్రస్తుతం కార్తీకమాసం శోభగా కొనసాగుతోంది. ఈ పవిత్ర మాసంలో ప్రతి రోజూ భక్తులు పెద్దఎత్తున దేవాలయాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా శివాలయాలు దీపాల కాంతులతో, శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. మహిళలు కూడా ప్రతి రోజూ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ సంపద, శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నారు.
ఇప్పుడు భక్తులందరూ ఎదురుచూస్తున్న కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం నవంబర్ 5వ తేదీ (రేపు) వచ్చింది. ఈ రోజు చాలా విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు. అందువల్ల ఈ రోజున కొన్ని ప్రత్యేక ఆచారాలు తప్పక పాటించాల్సినవిగా పేర్కొన్నారు.
పండితుల సూచన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి. అనంతరం దేవాలయంలో కానీ, రావి చెట్టు లేదా తులసి చెట్టు కింద గానీ, నదీ తీరంలో గానీ 365 వత్తులతో దీపారాధన చేస్తే పాప విమోచనం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే ఆ రోజున పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి పరమేశ్వరుడు, విష్ణుమూర్తి పూజలు చేయాలి. ఈ రోజు పవిత్ర నదుల్లో స్నానం చేస్తే ఆధ్యాత్మిక ఫలితం మరింత ఎక్కువగా లభిస్తుంది.
పండితుల ప్రకారం ఈసారి పౌర్ణమి తిథి ఈ రోజు రాత్రి 10:30 గంటల నుంచి రేపు సాయంత్రం 6:48 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు (బుధవారం) వ్రతం చేయడం శ్రేయస్కరం.
రేపు ఉదయం 4:52 నుంచి 5:44 గంటల మధ్య నదీ స్నానం చేసి, సాయంత్రం 5:15 నుంచి 7:05 గంటల మధ్య దీపారాధన చేయడం అత్యంత మంగళప్రదమని చెబుతున్నారు.
ఈ సమయాల్లో మనసులో ఏదైనా కోరిక కోరుకుంటూ దీపారాధన చేస్తే అది తప్పకుండా నెరవేరుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపారాధన చేస్తే పాప దోషాలు తొలగి ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.





