తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన ‘దున్నపోతు’ వ్యాఖ్యల వివాదం చివరికి ముగిసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు అడ్లూరి లక్ష్మణ్ మధ్య తలెత్తిన ఈ వివాదం పైసీ సీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యంతో సద్దుమణిగింది. ఈ రోజు ఆయన నివాసంలో ఇరువురు మంత్రులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించి, వారిని చర్చలకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, “అడ్లూరిని ఉద్దేశించి నేను ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. మీడియాలో వస్తున్న వార్తలు తప్పు. అలాంటి ఆలోచన నా మనసులో లేదు. మేమంతా కరీంనగర్లో మాదిగ సామాజిక వర్గం వారితో కలిసి పెరిగాం. ఆయనకు ఈ వ్యాఖ్యలపై బాధ కలిగితే అందుకు క్షమాపణ కోరుతున్నాను” అని తెలిపారు.
సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ
— Ponnam Prabhakar (@Ponnam_INC) October 8, 2025
కాంగ్రెస్ పార్టీ లో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను , మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాకు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదు..
నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి నేను క్షమాపణలు… pic.twitter.com/RoFXVgrgHP
గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. అయితే అడ్లూరి కొంత ఆలస్యంగా రాగానే, “జీవితం, సమయం గురించి మనకు తెలుసు.. ఆ దున్నపోతుకు ఏం తెలుసు?” అనే వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్య అడ్లూరి లక్ష్మణ్‌పై చేసినవని వార్తలు రావడంతో దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అడ్లూరి కూడా తీవ్రంగా స్పందిస్తూ, “నేను దళితుడినని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పొన్నం ఈ వ్యాఖ్యలు తాను అడ్లూరిని ఉద్దేశించి చెప్పలేదని, ఢిల్లీ టికెట్లు ఆలస్యమవుతుండడంతో తన సహాయకుడిపై ఆ మాట అన్నానని స్పష్టం చేశారు.





