HomePolitics Teluguనేటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం.. తొలి దశ మహిళలకు పెద్ద సర్‌ప్రైజ్

నేటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం.. తొలి దశ మహిళలకు పెద్ద సర్‌ప్రైజ్

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కోటి మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు తప్పకుండా చీర అందేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

ఈ చీరలను సంపూర్ణంగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు. అయితే ఉత్పత్తి కొద్దిగా ఆలస్యం కావడంతో పంపిణీని రెండు దశల్లో పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. మొదటి దశలో నేటి నుంచి డిసెంబరు 9న జరిగే తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ పూర్తిచేయాలి. రెండో దశలో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో చీరలను అందించాలని సీఎం ఆదేశించారు.

అర్హులైన మహిళా సంఘాల సభ్యులతో పాటు, అర్హత ఉన్న ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే మహిళలను సంఘాల్లో చేరేందుకు ప్రోత్సహించాలని సూచించారు.

చీరల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని, నాణ్యమైన చీరలే ప్రజలకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు దృష్టికి తెచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. చీరల పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని కూడా సూచించారు.

నేడు మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించిన తర్వాత చీరల పంపిణీని అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంతంలోని మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబంధిత కలెక్టరేట్ల నుంచి పాల్గొననున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular