HomePolitics Teluguకేటీఆర్, కిషన్ రెడ్డి ‘బ్యాడ్ బ్రదర్స్’.. ఏం చేశారో తెలుసా?: సీఎం రేవంత్ రెడ్డి

కేటీఆర్, కిషన్ రెడ్డి ‘బ్యాడ్ బ్రదర్స్’.. ఏం చేశారో తెలుసా?: సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) ఉపఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓటర్లకు కీలక సూచనలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్‌ హయాంలో పదేళ్లలో చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్‌ ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించిన అభివృద్ధితో పోల్చి చూడాలని కోరారు.

బీఆర్ఎస్‌ పాలనలో రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారిందని ఆయన విమర్శించారు. ఒకప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను ఈ దుస్థితికి తెచ్చిందని అన్నారు. అప్పులపై వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

కాంగ్రెస్‌ హయాంలోనూ, టీడీపీ హయాంలోనూ రాష్ట్రం అభివృద్ధి సాధించిందని, కానీ బీఆర్ఎస్‌ పాలనలో అభివృద్ధి శూన్యమని రేవంత్ వ్యాఖ్యానించారు. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి ప్రాజెక్టులు కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల కాలంలోనే అమలు అయ్యాయని గుర్తు చేశారు.

బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ తెలంగాణకు ఎలాంటి మేలు చేయలేదని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను లక్ష కోట్ల రూపాయల నష్టానికి కారణమైనదిగా అభివర్ణించారు. “కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్‌ కోసం కొత్త సచివాలయం కట్టారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు” అని అన్నారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మించారని ఆరోపించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. “పదేళ్లలో తెలంగాణకు ఏమి తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలి. వరదలు నగరాన్ని అతలాకుతలం చేసినప్పుడు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు” అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే ఫ్యూచర్‌ సిటీ, మెట్రో విస్తరణ, ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులను కేటీఆర్‌, కిషన్ రెడ్డి ఇద్దరూ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వీరిద్దరినీ “బ్యాడ్ బ్రదర్స్”గా పేర్కొంటూ, “హైదరాబాద్ ప్రజలు కూడా వారిని అలాగే చూస్తున్నారు” అని అన్నారు.

“మేము ఏడాదిన్నరలోనే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. కేసీఆర్ కుటుంబం మాత్రం రాష్ట్రాన్ని కొల్లగొట్టి వేల కోట్ల ఆస్తులు సంపాదించింది. ఫామ్‌హౌజ్‌లు, అక్రమ ఆస్తులతో సుఖంగా ఉన్నారు. నిరుద్యోగులను పదేళ్లు మోసం చేశారు. కానీ మేము ఏడాదిలోనే 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం” అని చెప్పారు.

కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో డ్రగ్స్‌, గంజాయి కల్చర్‌ పెరిగిందని విమర్శించారు. కంటోన్మెంట్‌లో రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, రేపు జూబ్లీహిల్స్‌లో కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు.

“బీఆర్ఎస్‌, బీజేపీలు కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కాబట్టి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలి” అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. “కేటీఆర్‌ అనే విషపురుగుకు కిషన్ రెడ్డి ఎందుకు లొంగిపోయారో అర్థం కావడం లేదు” అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular