HomePolitics Teluguమంత్రి అజారుద్దీన్‌కు కీలక శాఖలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం..

మంత్రి అజారుద్దీన్‌కు కీలక శాఖలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ కేబినెట్‌లో తాజాగా చేరిన మంత్రి మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) కు శాఖల కేటాయింపు పూర్తయింది. ఆయనకు మైనార్టీ సంక్షేమం మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. గవర్నర్ ఆమోదంతో ఈ శాఖలు కేటాయించబడ్డాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం సీఎం వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్‌తో పాటు ఇతర కేటాయించని విభాగాలు ఉన్నాయి. వాటిలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖను ఇప్పుడు అజారుద్దీన్‌కు అప్పగించారు.

ఇక గత జూన్‌లో కేబినెట్‌లో చేరిన అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్న మైనార్టీ శాఖను కూడా అజారుద్దీన్‌కి బదిలీ చేశారు. గత శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో అజారుద్దీన్ మంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, అజారుద్దీన్ హోం శాఖ కోసం ఆసక్తి చూపారనే ప్రచారం గత వారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చివరికి ఆ ఊహాగానాలకు తెరపడుతూ, ఆయనకు మైనార్టీ సంక్షేమం మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను ప్రభుత్వం కేటాయించింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular