పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాన్ (Cyclone Montha) తీవ్రరూపం దాల్చి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని అతలాకుతలం చేసింది. రాత్రి 12.30 గంటల సమయంలో ఈ తుపాన్ మచిలీపట్నం–కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా, నరసాపురం సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
ప్రస్తుతం ఈ తుపాన్ ఉత్తర–వాయువ్య దిశగా తెలంగాణ మీదుగా కదులుతోంది. బుధవారం మధ్యాహ్నానికి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బలహీనపడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గంటకు 85–95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.
ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వేర్వేరు స్థాయిలలో హెచ్చరికలు జారీ చేశారు
రెడ్ అలర్ట్: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నాగర్కర్నూల్
ఆరెంజ్ అలర్ట్: హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్
ఎల్లో అలర్ట్: మరో 11 జిల్లాలకు జారీ
తుపాన్ ప్రభావంతో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు విడుదల చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచించారు.





