కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని 20 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనం అయిన ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే, జాతీయ రహదారి 44పై హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (నంబర్ DD 01 N 9490) కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న బైక్ నేరుగా బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంక్‌ను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మంటల్లో మునిగిపోయింది.

ఈ ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వారిలో 12 మంది అత్యవసర ఎగ్జిట్ డోర్‌ను బద్దలుకొట్టి ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే 20 మందికిపైగా మంటల్లో చిక్కుకుని దుర్మరణం పాలైనట్లు ప్రాథమిక సమాచారం.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో మృతుల పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ప్రాణాలతో బయటపడ్డ వారిలో జయసూర్య, రామిరెడ్డి, హారిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, రమేశ్, సుబ్రహ్మణ్యం వంటి వారు ఉన్నారని సమాచారం.
ఈ ఘోర దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. బస్సు పూర్తిగా దగ్ధమై గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





