తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాను టీడీపీ తిరువూరు టికెట్ పొందేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, కేశినేని శివనాథ్ (చిన్ని) రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు.
కొలికపూడి వివరాల ప్రకారం, గత ఏడాది ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, 8న మరో రూ.20 లక్షలు, 14న మరిన్ని రూ.20 లక్షలు తన బ్యాంకు ఖాతా నుంచి ట్రాన్స్‌ఫర్ చేశానని తెలిపారు. అలాగే పోరంకిలో కేశినేని చిన్ని పీఏ మోహన్‌కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన స్నేహితుల ద్వారా రూ.3.5 కోట్లు అందజేశానని చెప్పారు. ఈ వ్యవహారం గురించి రేపు మరింత వివరంగా మాట్లాడతానని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. “నిజం గెలవాలి.. నిజమే గెలవాలి” అంటూ పోస్ట్ చేశారు.
ఇదే అంశంపై కేశినేని చిన్ని (Kesineni Chinni) కూడా స్పందించారు. “నేను ఎప్పుడూ నా జేబులోని డబ్బు మాత్రమే ఖర్చు చేస్తాను. నేను ఎవరికి పదవులు ఇవ్వను, కోవర్టులకు కూడా కాదు. ప్రజలు ఈ ఆరోపణలను నమ్మరని నాకు నమ్మకం ఉంది. ఎవరు ఎవరి పంచన చేరారో అందరికీ తెలుసు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ఈ రోజు తిరువూరు నియోజకవర్గంలో కేశినేని చిన్ని పర్యటించారు. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి పాల్గొనకపోవడం గమనార్హం. వీరిద్దరి మధ్య పెరుగుతున్న విభేదాలు పార్టీకి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ జోక్యం చేసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ ఇద్దరు నేతలను రేపు టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశం ద్వారా పార్టీ లోపల కొనసాగుతున్న వివాదం పరిష్కారమవుతుందా అనే ఆసక్తి నెలకొంది.





