కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటక తీరప్రాంత సంస్కృతి, జానపద సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రేక్షకులకు హృదయానికి హత్తుకునేలా చూపించి ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఇటీవల విడుదలైన ‘కాంతార: చాప్టర్ 1’ కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి ఆయన క్రేజ్‌ను మరింత పెంచింది.
ఇప్పుడు రిషబ్ శెట్టికి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) 2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ‘లీడర్షిప్ ఇన్ సినిమా’ అవార్డును IFFM యాజమాన్యం ఆయనకు ప్రదానం చేయనుంది.
ఈ గౌరవంపై స్పందించిన రిషబ్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మన మూలాలను ప్రపంచ ప్రేక్షకులకు చేరవేయడమే తన కథల లక్ష్యమని చెప్పారు. మన సంస్కృతికి సంబంధించిన కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించడం తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
మెల్బోర్న్ వేదికపై భారతీయ సినిమా గొప్పదనాన్ని ప్రపంచ ప్రేక్షకులతో పంచుకునే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రిషబ్ శెట్టి తెలిపారు.
ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తూ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ రెండు భారీ చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.





