మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ చిత్రబృందం వరుస అప్డేట్స్‌ను విడుదల చేస్తోంది. ఇప్పటికే వెంకటేష్ ‘చిట్టిబాబు’, శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’ పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రకటించిన మేకర్స్.. తాజాగా వీరి కుమార్తె పాత్రను కూడా పరిచయం చేశారు.
‘చిట్టితల్లి’ అలియాస్ ‘సంపూర్ణ’ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ యువినా పార్థవి నటిస్తోంది. ఈ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
వీడియోలో వెంకటేష్, యువినా పార్థవి మధ్య జరిగే సరదా సంభాషణలు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి. లుంగీ కట్టుకుని పేపర్ చదువుకుంటూ, రిటైర్డ్ తెలుగు టీచర్‌లా ప్రశాంతంగా జీవించాలని ఉందని వెంకటేష్ చెబుతుండగా.. ఆయన కుమార్తె వచ్చి తాను ప్రేమలో పడ్డానని చెబుతుంది. దానికి వెంకటేష్ సరదాగా ‘ఈసారి కారు మెకానికా?’ అని ప్రశ్నించగా, ‘నీకెలా తెలుసు?’ అని చిన్నారి ఇచ్చే సమాధానం నవ్వులు పూయిస్తుంది.
ఆ తర్వాత ‘ప్రేమ అంటే ఏంటో తెలుసా?’ అని వెంకటేష్ అడగ్గా.. ‘నాకేమవుతుందో అన్న బాధ కంటే, వాడికేమవుతుందో అనే భయం ఎక్కువైతే అదే ప్రేమ’ అంటూ చిన్నారి చెప్పే డైలాగ్ వీడియోకు హైలైట్‌గా నిలిచింది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలైన ఈ ఫన్నీ ప్రమోషనల్ వీడియో సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.





