విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం మరో కీలక అడుగు వేయబోతున్నారు. ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్న ఆయన.. ఇప్పుడు దర్శకుడిగానూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, కిరణ్ అబ్బవరం స్వయంగా కథ రాసుకుని, హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టనున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన కెరీర్‌లో ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భావోద్వేగాలు, కుటుంబ విలువలు, వినోదాత్మక అంశాల సమ్మేళనంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత చాగంటి సుధాకర్ నిర్మించనున్నారు. సంగీత బాధ్యతలను ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో నిర్వహించనున్నట్లు సమాచారం.
ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమం శుక్రవారం ఉదయం సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, దర్శకుడిగా కూడా విజయాన్ని అందుకుంటారా అనే ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది.






