తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సినీ పరిశ్రమకు భారీ ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమిళనాడులో విడుదలయ్యే ప్రతి కొత్త సినిమాకు మొదటి వారం రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో కోలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సినీ నటుడిగా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు గడిపిన విజయ్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినీ పరిశ్రమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో సినిమా రంగానికి ఊరటనిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇప్పటివరకు తమిళనాడులో పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు అదనపు షోలు లేదా స్పెషల్ షోల కోసం ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండేది.
దీనికోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ముందుగానే అధికారులను సంప్రదించాల్సి వచ్చేది. కొన్నిసార్లు అనుమతులు ఆలస్యమవడంతో థియేటర్ యజమానులు ఇబ్బందులు పడేవారు.కొత్త నిబంధనల ప్రకారం.. సినిమా విడుదలైన మొదటి వారం రోజుకు ఐదు షోలు ఎలాంటి ప్రత్యేక ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రదర్శించుకోవచ్చు.
థియేటర్ యజమానులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పరస్పర అంగీకారంతో అదనపు షోలను ప్లాన్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.ఈ నిర్ణయంతో పెద్ద హీరోల సినిమాలకు మొదటి వారం భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే టికెట్ల కోసం ఉండే భారీ డిమాండ్ కారణంగా జరిగే బ్లాక్ టికెట్ వ్యవహారాలకు కూడా కొంతవరకు అడ్డుకట్ట పడొచ్చని విశ్లేషిస్తున్నారు.
సినిమా రంగంలో ఉన్న సమస్యలు బాగా తెలిసిన వ్యక్తి కావడంతోనే సీఎం విజయ్ ఇండస్ట్రీకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నారని తమిళ సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. మొత్తానికి, రోజుకు 5 షోలకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయం తమిళనాడు సినిమా రంగంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.





