రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’ మరోసారి వాయిదా పడింది. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.
మొదట ఈ సినిమాను ఉగాది సందర్భంగా విడుదల చేయాలని భావించిన మేకర్స్, తర్వాత జూన్ 4కు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా మారినట్లు యష్ అధికారికంగా ప్రకటించారు.
యష్ మాట్లాడుతూ.. ‘సినిమా పూర్తిగా సిద్ధంగా ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ పంపిణీ భాగస్వామ్యాలపై చర్చలు జరుగుతున్నాయి. అందుకే జూన్ 4 తేదీని మారుస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని తెలిపారు.
ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా, గ్లోబల్ రేంజ్‌లో విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ పనిచేస్తున్నారు. ఆ కారణంగానే రిలీజ్ విషయంలో జాగ్రత్తగా ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వాయిదాకు ఓటీటీ బిజినెస్ కూడా ఒక కారణమని ఇండస్ట్రీ టాక్. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.110 కోట్ల ఆఫర్ ఇవ్వగా, మేకర్స్ మాత్రం కనీసం రూ.250 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ డీల్ ఫైనల్ అయిన తర్వాతే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
‘టాక్సిక్’ సినిమాను ఏకంగా ఆరు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యష్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.





