పిఠాపురం నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య ప్రోటోకాల్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై మొదలైన చిన్న వివాదం, చివరకు నేతల మధ్య బహిరంగ విమర్శలకు దారి తీసింది.
అధికారిక ఫ్లెక్సీల్లో సీఎం ఫోటో లేకపోవడాన్ని టీడీపీ నేతలు ప్రశ్నించగా, జనసేన నేతలు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చెలరేగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేత వర్మ మాట్లాడుతూ.. పిఠాపురంలో టీడీపీ ఇంకా బలంగా ఉంది కాబట్టే ఇక్కడ 70 వేల మెజార్టీ వచ్చింది. మేము లేకపోతే జనసేన గెలిచేదా? అంటూ ప్రశ్నించారు.
తాము ఎక్కడి నుంచో వచ్చిన వారు కాదని, స్థానికంగా టీడీపీకి బలమైన కేడర్ ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వర్మ వ్యాఖ్యలపై జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తీవ్రంగా స్పందించారు. వర్మ మొదటి నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను టీడీపీ నేతలే ధ్వంసం చేశారని, చంద్రబాబు-లోకేష్ దగ్గర మార్కులు కొట్టేయడానికే వర్మ ఇలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే ఆయనపై మరిన్ని విషయాలు బయటపెడతానని హెచ్చరించారు.
ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడంతో పిఠాపురంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన కూటమి నేతలు ఇప్పుడు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై అగ్రనాయకత్వం జోక్యం చేసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు.





