HomeMovie News Teluguతట్టుకోలేనంత కష్టంలో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌

తట్టుకోలేనంత కష్టంలో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌

అన్నదమ్ములిద్దరూ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి వచ్చారుగానీ, వారి రాక ఎంత కష్టమయ్యిందో వారి ప్రవర్తనలోనే కన్పించింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొత్త సినిమా ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా అన్నదమ్ముల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూసి అభిమానులు చలించిపోయారు.

సినిమాలోని ‘పెనివిటి’ పాట ఇప్పటికే విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. విజయం అనడం కన్నా, ఇది వినేవారి గుండెల్ని సూటిగా తాకేసిందని చెప్పడం సబబు. ఆ బాధ అనుభవిస్తోన్న అన్నదమ్ములకి ఆ పాట ఇంకెంతగా కంటతడి పెట్టించి వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల హరికృష్ణ మరణంతో తండ్రిలేని పిల్లలుగా మారిన ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌.. నిన్న ‘అరవింద సమేత’ ఫంక్షన్‌లో చిన్న పిల్లలుగానే కన్నీరు పెడుతూ కన్పించారు. ‘ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదు’ అని చాలామంది అనుకున్నారు. 

నిజమే, హరికృష్ణ వుంటే నిన్నటి ఫంక్షన్‌కి ఆయనే హైలైట్‌ అయ్యేవారు. తండ్రీ, కొడుకుల అనుబంధం అలాంటిది. ఇంతటి విషాదంలోనూ, ‘ఈ రోజు కాకపోతే, రేపు వెళ్ళొచ్చు.. కానీ, జాగ్రత్త. మీ ఇంటి దగ్గర మీకోసం ఎదురుచూసేవాళ్ళున్నారు..’ అన్న చక్కటి సందేశాన్ని కళ్యాణ్‌రామ్‌, నందమూరి అభిమానులకు ఇచ్చాడు. ఇదీ బాధ్యత అంటే. ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చాలా అద్భుతంగా జరిగిందని చెప్పడం కంటే, చాలా ఎమోషనల్‌గా జరిగిందని చెప్పడం కరెక్ట్‌. ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక హాసిని సంస్థ ఈ సినిమాని రూపొందించింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular