HomeMovie News Teluguఇరుముడి పై వివాదం.. ఆ సీన్లు తొలగించాలంటూ డిమాండ్

ఇరుముడి పై వివాదం.. ఆ సీన్లు తొలగించాలంటూ డిమాండ్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ప్రియ భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నాటి నుంచే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో మంచి వసూళ్లు నమోదవుతున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (APTF) నాయకులు చెన్నుపాటి మంజుల, బసవలింగారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించే సమయంలో దర్శకులు బాధ్యతగా వ్యవహరించాలని వారు సూచించారు. ‘ఇరుముడి’లో ప్రభుత్వ పాఠశాల మహిళా టీచర్ పాత్రను ప్రతికూలంగా చూపించడంపై వారు అభ్యంతరం తెలిపారు.

అంతేకాకుండా సినిమాలో చూపించిన పాఠశాల, విద్యార్థుల యూనిఫాం తదితర అంశాలు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలను పోలి ఉన్నాయని వారు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు జిల్లా పరిషత్ పాఠశాల పేరును సినిమాలో ఉపయోగిస్తూ ఉపాధ్యాయ వృత్తి, పాఠశాల వ్యవస్థను తక్కువ చేసి చూపించారని ఆరోపించారు.

సినిమాలు సమాజంపై ప్రభావం చూపుతాయని, ఇలాంటి సన్నివేశాల వల్ల ఉపాధ్యాయులపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని APTF నాయకులు అభిప్రాయపడ్డారు. అందువల్ల వివాదాస్పదంగా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని కోరారు.

ప్రస్తుతం ‘ఇరుముడి’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సమయంలో ఈ వివాదం చిత్ర బృందానికి కొత్త తలనొప్పిగా మారింది. ఈ ఆరోపణలపై దర్శకుడు శివ నిర్వాణ, చిత్ర బృందం ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular