కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఒక్కరోజు మాత్రమే ఉండటంతో ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి ఒక్కో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.100 వరకు అదనంగా పెంచుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే పెంచిన టికెట్ ధరలు 10 రోజుల పాటు మాత్రమే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ‘టాక్సిక్’ సినిమాకు తెలంగాణలో టికెట్ ధరలు కొంతమేర పెరగనున్నాయి.
మరోవైపు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం ఓ కీలక షరతును విధించింది. సినిమా నిర్మాణ సంస్థ KVN-మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ LLP తప్పనిసరిగా రూ.కోటి మొత్తాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.
ఈ మొత్తాన్ని తెలుగు సినీ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో టికెట్ ధరల పెంపునకు అనుమతితో పాటు సినీ కార్మికుల సంక్షేమానికి నిధులు సమకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.





