ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రియా శరణ్, ప్రస్తుతం విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది మిరాయ్ లో అంబికా ప్రజాపతి పాత్రలో మెప్పించిన ఆమె, దృశ్యం-3 లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా శ్రియా శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన శ్రియా.. దానికి ‘హ్యాపీ డే’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో రజినీకాంత్ తన తదుపరి చిత్రం ‘ధర్మన్’ లుక్‌లో కనిపించడం విశేషం.
దీంతో శ్రియా శరణ్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారనే ప్రచారం ఊపందుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రజినీకాంత్‌తో కలిసి శ్రియా శరణ్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రజినీకాంత్, శ్రియా శరణ్ కాంబినేషన్ అనగానే అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది బ్లాక్‌బస్టర్ చిత్రం ‘శివాజీ’. ఈ సినిమా విడుదలై దాదాపు 19 ఏళ్లు పూర్తైన తర్వాత మరోసారి వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. రామ్ పోతినేని, రాశి ఖన్నా, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా, సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.






