ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కేసు తీవ్రత దృష్ట్యా ఎంవీపీ కాలనీ పోలీసులు ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.
రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి తన ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని, పరువు నష్టం కలిగించారని, దొంగతనానికి పాల్పడ్డారని, తన ప్రాణాలకు హాని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ రెడ్డితో పాటు కొందరు అడ్వకేట్లు, జర్నలిస్టుల పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.
కాగా, బాధితురాలు గతంలో 2026 మార్చి 10న కేవలం రాహుల్ రెడ్డిపై మాత్రమే సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే కొన్ని నెలల తర్వాత జూన్ 11న ఇచ్చిన మరో ఫిర్యాదులో అదనంగా మరికొందరి పేర్లను చేర్చినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదులో నిందితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ రెడ్డి నుంచి రూ.కోటి డిమాండ్ చేశారని, ఆ డిమాండ్ నెరవేరకపోవడంతోనే మరికొందరి పేర్లను ఫిర్యాదులో చేర్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆరోపణలు మాత్రమే కాగా, ఈ కేసులో నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.





