HomeMovie News Teluguకొత్త కథలు ఉంటే అన్నపూర్ణ స్టూడియోకు రండి..

కొత్త కథలు ఉంటే అన్నపూర్ణ స్టూడియోకు రండి..

కొత్త కథలతో వచ్చే దర్శకులకు అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని అక్కినేని నాగార్జున ప్రకటించారు. మంచి కథ ఉంటే ఎవరైనా అన్నపూర్ణ స్టూడియోస్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ‘పళ్ళ బురుసు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కొత్త కథలతో ఎవరైనా వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని నాగార్జున వెల్లడించారు. తమ బ్యానర్‌పై ఇప్పటికే ఎన్నో సినిమాలు నిర్మించామని, ఇకపై మరింత వేగంగా కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

స్టూడియోను కేవలం లీజుకు ఇచ్చి డబ్బులు సంపాదించడానికే కాకుండా, తిరిగి సినీ పరిశ్రమకు ఏదైనా అందించాలనే ఉద్దేశంతో సినిమాలు నిర్మిస్తున్నామని నాగార్జున పేర్కొన్నారు. ఇటీవల ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నామని, ఇప్పుడు ‘పళ్ళ బురుసు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు.

అలాగే రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’ సినిమాను విడుదల చేయనున్నట్లు నాగార్జున తెలిపారు. అనంతరం తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘కింగ్ 100’ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, గోమతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్ళ బురుసు’ చిత్రానికి ఉదయ్ చౌహన్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular