HomeMovie News Teluguలెజెండరీ గాయని ఎస్. జానకి కన్నుమూత..

లెజెండరీ గాయని ఎస్. జానకి కన్నుమూత..

భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో అలరించిన ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. అనారోగ్యంతో మైసూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో సినీ పరిశ్రమతో పాటు సంగీతాభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు సినీ ప్రముఖులు, సంగీత విద్వాంసులు ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఎస్. జానకి చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందిన ఆమె, 1957లో తమిళ చిత్రం ‘విధియిన్ విలయాట్టు’ ద్వారా సినీ గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో ఆమె పాటలు ఆలపించారు. కెరీర్‌లో 50 వేలకుపైగా పాటలు పాడిన అరుదైన గాయనిగా ఎస్. జానకి గుర్తింపు పొందారు. ఘంటసాల, ఎం.ఎస్. విశ్వనాథన్, కే.వి. మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, రాజ్-కోటి, ఎం.ఎం. కీరవాణి, ఏ.ఆర్. రెహమాన్, బప్పీ లహరి వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించిన యుగళగీతాలు దక్షిణ భారత సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి.

తెలుగు ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గర చేసిన పాటల్లో ‘నీలి మేఘాలలో’, ‘సిరిమల్లె పువ్వా’, ‘పగలే వెన్నెల’, ‘ఝుమ్మంది నాదం’, ‘మౌనమేలనోయి’, ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’, ‘మనసా తుళ్లిపడకే’, ‘వెన్నెల్లో గోదారి అందం’ వంటి ఎన్నో మధుర గీతాలు ఇప్పటికీ సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి.

అద్భుతమైన గాన సేవలకు గుర్తింపుగా ఎస్. జానకి నాలుగు జాతీయ పురస్కారాలు, పది నంది అవార్డులు సహా అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి గౌరవాలను అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి, కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ ప్రశస్తి పురస్కారాలతో సత్కరించగా, మైసూర్ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. జీవితకాలంలో అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న ఆమె, భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప గాయని.

ఎస్. జానకి మరణంతో భారతీయ సినీ సంగీత ప్రపంచం ఓ అపూర్వ గాన కోకిలను కోల్పోయింది. ఆమె ఆలపించిన వేలాది పాటలు తరతరాలకు చిరస్మరణీయంగా నిలిచి, సంగీతాభిమానుల హృదయాల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular