టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన అభిమానిపై చూపిన ఆప్యాయతతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన టీజీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్టేడియంలో తన అభిమాన హీరోను దగ్గరగా చూసిన ఓ యువ అభిమాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ‘అన్నా.. నేను బాగా క్రికెట్ ఆడతాను.. నాకు కొంచెం సపోర్ట్ చేయండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ విజయ్‌ను వేడుకున్నాడు.
అభిమాని ఆవేదనను గమనించిన విజయ్ దేవరకొండ వెంటనే అతన్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని ఓదార్చారు. అనంతరం అతని వివరాలు తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని చెప్పడంతో పాటు సాధ్యమైనంత సహాయం చేస్తానని భరోసా ఇచ్చినట్లు అక్కడున్న వారు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానితో విజయ్ వ్యవహరించిన తీరు చూసిన నెటిజన్లు ఆయన మానవత్వాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఉంటారు. ప్రతి ఏడాది ‘దేవరశాంటా’ కార్యక్రమం ద్వారా అభిమానులకు ప్రత్యేక కానుకలు అందించడం, అలాగే విద్యార్థుల విద్యకు ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలతో ఆయన పలువురికి అండగా నిలుస్తున్నారు.
There Are So Many Fans Who Love Their Heroes With Unwavering Loyalty. @TheDeverakonda ❤️ pic.twitter.com/s4blzgcHSV
— Indian Clicks (@IndianClicks) July 13, 2026





