చిత్రం: కర
దర్శకత్వం: విఘ్నేశ్ రాజా
కథ – రచన: ఆల్ఫ్రెడ్ ప్రకాశ్, విఘ్నేశ్ రాజా
నటీనటులు: ధనుష్, మమితబైజు, కె.ఎస్.రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీరాజన్, సూరజ్ వెంజరమూడు, శ్రీజ రవి తదితరులు
నిర్మాతలు: ఇషారి కె. గణేశ్, కుష్మిత గణేష్
సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్
సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
బ్యానర్: వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్
విడుదల తేదీ: 01 మే 2026
ఐక్లిక్ న్యూస్ రేటింగ్: 2.5/5
ధనుష్ తమిళ హీరో అయినా అన్ని భాషల్లో ఫాలోయింగ్ సంపాదించు కున్నాడు. తమిళ తంబీలకే కాదు తెలుగు వాళ్ళకి కూడా ధనుష్ స్టార్ హీరో & ఫెవరెట్ హీరో. తెలుగులో సార్, కుబేర సినిమాలతో భారీ హిట్స్ కొట్టాడు ధనుష్. గతేడాది ‘రాయన్’, ‘కుబేర’, ‘తేరే ఇష్క్ మే’ లాంటి పాన్ ఇండియా సినిమాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ధనుష్ ఈ ఏడాది ‘కర’ మూవీతో ప్రేక్షుకులముందుకు వచ్చాడు. కర సినిమా భారీ అంచనాలతో ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయింది మరి ‘కర’ ఎలా ఉంది? ధనుష్ మరొక హిట్ కొట్టాడా ? అసలు ఈ సినిమా కథేంటి అన్నది ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
కరస్వామి (ధనుష్) దొంగతనాలు చేస్తూ బతుకుతుంటాడు.చివరికి సొంత తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర కూడా దొంగతనం చేసి ఇంట్లోంచి పారిపోయి దూరంగా బతుకుతుంటాడు. అనుకోకుండా ఒకసారి పోలీసులకి చిక్కి, డిఎస్పి భరతన్ (సూరజ్) నుంచి తప్పించుకుంటాడు. ఆ సంఘటనతో రియలైజ్ అయిన కర ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి (మమిత బైజు) కోసం దొంగ తనాలు ఆపేసి కష్టపడి బతుకుదాం అని నిర్ణయించుకుంటాడు. కర ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. దీనికంటే సొంతంగా తానే హోటల్ పెట్టుకోవాలని తండ్రి సాయం కోసం సొంత ఊరు వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వలన తండ్రి (కేఎస్ రవికుమార్) ని కోల్పోతాడు. అనుకోని పరిస్థితుల్లో మళ్లీ దొంగగా మారుతాడు. లోకల్ లో ఉన్న ముత్తు సెల్వన్ (జయరామ్) పంచవన్ యూనియన్ బ్యాంకుల్ని లూటీ చేయటం ప్రారంభిస్తాడు. దొంగతనాలు వదిలేసిన కర మళ్ళీ దొంగగా మారటానికి ఎదురైనపరిస్థితులేంటి? కర తండ్రి చావుకి కారణం ఏంటి ? ముత్తు సెల్వన్‌కు చెందిన బ్యాంకుల్ని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు? పోలీసుల నుంచి తప్పించుకున్న కర ని మళ్ళీ డీఎస్పీ భరతన్ (సూరజ్ వెంజరమూడు) అరెస్ట్ చేశాడా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ధనుష్ సినిమా అనగానే పాన్ ఇండియా ప్రేక్షుకుల్లో మంచి అంచనాలు ఏర్పడతాయి. కారణం ధనుష్ కథలు డిఫరెంట్ గా ఉంటాయని, ఏదో ఒక కొత్త విషయం చెప్తాడని. నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా ధనుష్ హిట్స్ అందుకోవటంతో కర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కర సినిమా కథ బ్యాంకులు, వడ్డీలు అన్న విషయం మీదే సాగుతుంది. ఇలాంటి కథలు ఇప్పటికే చాలా వచ్చాయి కానీ దర్శకుడు విగ్నేష్ రాజా కర మూవీని డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారు. ఈ మధ్య దర్శకులంతా 90 స్ థీమ్ తో వెళ్తున్నారు. విగ్నేష్ రాజా కూడా ఈ నేపథ్యంతో కథని నడిపించారు. తండ్రిని కూడా వదలకుండా దోచుకున్న ఒక దొంగ ప్రేమించిన అమ్మాయి కోసం మనసు మార్చుకుని కస్టపడి బతుకుదాం అనుకోవటం, బ్యాంకు అధికారుల కారణంగా మళ్లీ దొంగతనాలు చేయటం? బ్యాంకులకు ఒక దొంగ బుద్ధి చెప్పిన తీరు ఆసక్తిగా ఉంది. పేపర్ మీద రాసుకున్న కథని ఎక్కడా తడబడకుండా ప్రజంట్ చేసాడు దర్శకుడు. కొన్ని కొన్ని సీన్స్ బాగా పండాయి. కొన్ని అరవ వాసనలు వలన మన నేటివిటీకి దగ్గరగా లేదు. కాకపొతే బ్యాంకుల వడ్డీ టాపిక్ అందరికీ కనెక్ట్ అవుతుంది. హీరో లేని సీన్స్ కూడా కథని హైలెట్ చేయటం గొప్ప విషయం. క్లైమాక్స్ బాగుంది .
తండ్రీ – కొడుకుల ఎమోషన్స్ తో సాగే థ్రిల్లర్ ఇది. తండ్రీ – కొడుకుల ఎమోషన్‌తో అటు రైతుల రుణ సమస్యలతో కథని లింక్ చేయటం బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లో గా సాగినా సెకండ్ హాఫ్ స్పీడ్ అందుకుంది. కర తండ్రి చనిపోవడంతో కథలో వేగం పెరిగి థ్రిల్లర్ కోణంలోకి మారిపోతుంది. సెకండ్ హాఫ్ లో కరని పట్టుకోవడానికి డీఎస్పీ భరతన్ వేసే ప్లాన్స్ సిల్లీగా ఉంటాయి. ఇంకో వైపు కరపై నెట్టేందుకు ముత్తు సెల్వన్ తన బ్యాంకుల్నే తానే దోచుకోవడం విచిత్రంగా ఉంటుంది. ఇన్ని సమస్యలని దాటుకుని తండ్రికిచ్చిన మాటని నెరవేర్చిన కర సాహసం ప్రేక్షకులని మెప్పిస్తుంది.
నటీ నటులు:
కరస్వామి పాత్రలో ధనుష్ నటన ఆకట్టుకుంది. దొంగగా, ప్రేమికుడిగా, భర్తగా, కొడుకుగా అన్ని పాత్రల్లో ఒదిగిపోయాడు ధనుష్ . ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. తండ్రితో వచ్చిన ఎమోషనల్ సీన్స్ లో ధనుష్ నటనతో ప్రేక్షుకుల గుండెలు బరువెక్కుతాయి. కర పాత్రకి ధనుష్ వంద కి వంద శాతం న్యాయం చేసాడు. ధనుష్ తండ్రీగా కేఎస్ రవికుమార్ నటన ఆకట్టుకుంది. ఆ పాత్రకి హుందాతనం తెచ్చారు రవికుమార్. ప్రేమలు సినిమాతో కుర్రాళ్ళ మనసులు కొల్లగొట్టిన మమితా బైజు ఈ సినిమాలో మల్లి అనే డీగ్లామర్ పాత్రలో నటనతో ఆకట్టుకుంది. తన పాత్ర నిడివి తక్కువైనా నటనతో మెప్పిస్తుంది. స్క్రీన్ ప్రజెన్సీ బాగుంది. డీఎస్పీగా సూరజ్, బ్యాంక్ అధినేతగా జయరామ్ ల నటన ఫర్వాలేదనిపిస్తుంది. మిగతా పాత్రలు తమ తమ పరిధి మేరకు నటించాయి.
టెక్నికల్:
దర్శకుడు విఘ్నేశ్ ఎంచుకున్న కథ రొటీన్ గా ఉన్నా ప్రజెంటేషన్ బాగుంది. స్క్రీన్‌ప్లే తో కథని కొత్తగా చెప్పారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం కర మూవీకి ప్రధాన బలం అని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కథని యాక్షన్ సీన్స్ ని హైలెట్ చేసేలా ఉంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. విజువల్స్, ఆర్ట్ వర్క్ సూపర్ గా ఉన్నాయి. 90 స్ నాటి ప్రపంచాన్ని మళ్లీ రీ-క్రియేట్ చేసిన ఆర్ట్ వర్క్ ని మెచ్చుకోవలసిందే. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ధనుష్
బలమైన ఎమోషన్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
లాజిక్స్ మిస్ అవటం
స్లో నెరేషన్
నేటివిటీ కి దగ్గరగా లేకపోవటం
ఫైనల్ వర్దిక్ట్ : ఎంగేజింగ్ థ్రిల్లర్ డ్రామా ‘కర’





