బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ ను వెండితెరపై చూసి భావోద్వేగానికి లోనయ్యారు. జునైద్ హీరోగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘ఏక్ దిన్’ ప్రీమియర్ షో చూసిన అమీర్ ఖాన్ కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి.
తన కుమారుడి నటనను చూసి ఒక తండ్రిగా గర్వపడిన అమీర్ ఖాన్ భావోద్వేగానికి గురైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు అమీర్‌లోని ప్రేమగల తండ్రిని చూసి మెచ్చుకుంటున్నారు.
‘ఏక్ దిన్’ సినిమా ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో జునైద్ ఖాన్ సరసన సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది.
ఈ జోడీ అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్ ఖాన్ స్వయంగా నిర్మించారు. దర్శకుడు సునీల్ పాండే ఈ సినిమాను తెరకెక్కించారు.
జునైద్ ఖాన్ గత కొన్నేళ్లుగా థియేటర్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొంది, ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
జునైద్ గురించి గతంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. తన కుమారుడు కథల ఎంపిక, కెరీర్ విషయంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పారు.
తండ్రి స్టార్‌డమ్‌ను ఉపయోగించుకోకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని జునైద్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
‘ఏక్ దిన్’ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమాతో జునైద్ ఖాన్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.





