back to top
Thursday, February 12, 2026
spot_img
HomeTeluguఛాంపియన్‌ మూవీ రివ్యూ & రేటింగ్

ఛాంపియన్‌ మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: ఛాంపియన్‌
దర్శకత్వం: ప్రదీప్‌ అద్వైతం
కథ – రచన: ప్రదీప్‌ అద్వైతం

నటీనటులు: రోషన్‌, అనస్వర రాజన్‌, సంతోష్‌ ప్రతాప్‌, అవంతిక, కళ్యాణ్ చక్రవర్తి, కృతి కంజ్‌ సింగ్‌ రాథోడ్‌, హైపర్‌ ఆది తదితరులు

నిర్మాతలు: ప్రియాంక దత్‌, జీకే మోహన్‌, జెమిని కిరణ్‌

సంగీతం: మిక్కీ జే మేయర్‌
సినిమాటోగ్రఫీ: మథి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

బ్యానర్: స్వప్న సినిమాస్ బ్యానర్
విడుదల తేదీ: 25 డిసెంబరు 2025

నిర్మలా కాన్వెంట్ సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసాడు శ్రీకాంత్ వారసుడు రోషన్. మొదటి సినిమాకే తన నటనతో అకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డు గెల్చుకున్నాడు. తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పెళ్లి సందడి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాలుగేళ్ళ తరువాత ఛాంపియన్ తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన డ్రామాతో ఆడియన్స్ ని అలరించేందుకు వచ్చాడు. తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో తెరకెక్కింది ఛాంపియన్. ట్రైలర్, సాంగ్స్ తో పాజిటీవ్ బజ్ తెచ్చుకుని మరిన్ని అంచనాలు పెంచింది ఛాంపియన్. మరి ఛాంపియన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా ? రోషన్ హిట్ కొట్టాడో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :
మైఖేల్ (రోషన్) సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేస్తూ ఉంటాడు. ఇంగ్లాండ్‌లో సెటిల్ అవ్వాలన్నది అతని బిగ్ డ్రీమ్. అందుకోసం ఫుట్‌బాల్ సరైన దారి అని, ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌గా నిలవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో మైఖేల్ కి ఇంగ్లాండ్ వెళ్లే ఛాన్స్ వస్తుంది. కానీ తండ్రి కారణంగా వెళ్లలేకపోతాడు. మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా తుపాకులు డెలివరీ చేసే డీల్ వస్తుంది. ఈ క్రమంలో అనుకోకుండా మైఖేల్ దారితప్పి తుపాకులు ఉన్న ట్రక్కుతో బైరాన్‌పల్లికి చేరుతాడు. ఇండియాకి స్వాతంత్రం వచ్చినా నిజాం పాలనలో బైరాన్ పల్లి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. బైరాన్ పల్లిలో చంద్రకళ (అనస్వర రాజన్)తో మైఖెల్‌కు పరిచయం అవుతుంది. ఆ సమయంలోనే రజాకార్లు ఊరి మీద పడి మారణకాండ సృష్టిస్తారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసే తిరుగుబాటులతో మైఖేల్‌లో మార్పు వస్తుంది. లండన్ వెళ్లాలని కలలు కన్న మైఖెల్ బైరాన్ పల్లి కోసం ఏం చేశాడన్నది కథ. మైఖేల్ ఇంగ్లాండ్ చేరుకోవడానికి తండ్రి ఎందుకు అడ్డంకిగా మారాడు? బైరాన్‌పల్లి గ్రామానికి వెళ్ళిన తర్వాత మైకేల్ ఏం చేశాడు? చివరికి మైఖేల్ లండన్ కి వెళ్లాడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఛాంపియన్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
భారతదేశానికి స్వతంత్రం వచ్చినా హైదరాబాద్ లో నిజాం పాలన కొనసాగుతున్న రోజుల్లో జరిగిన కథ ఛాంపియన్. ఇది కొత్త కథ కాదు. రాజన్న, రజాకర్, కథలు ఇలాంటివే. నిజాం పాలన నేపథ్యంలో వచ్చిన కథలకి కమర్షియల్ హంగులు అద్ది తీసిన కథ లాగా ఉంది ఛాంపియన్. రొటీన్ కథ అయినా ఎమోషనల్ డ్రామాగా మలచటంతో ఛాంపియన్ లో కొంత భిన్నత్వం కనిపిస్తుంది. ఇండిపెండెన్స్ మూమెంట్, ఆనాటి పరిస్థితులు, నిజాం పాలన.. రజాకార్ల అరాచకాలు, చూపిస్తూ ఫుట్బాల్ కూడా వీటికి యాడ్ చేసారు. ఫస్టాఫ్ స్లో గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. సెకండ్ ఆఫ్ మళ్లీ స్లో అయింది. ఎడిటింగ్ పై శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ వేగం పెరిగింది. క్లైమాక్స్ కూడా బాగా కుదిరింది. ఎమోషనల్లీ ఛాంపియన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. దర్శకుడి ఉద్దేశ్యం రజాకార్ ఉద్యమాన్ని హైలెట్ చేయటం కాదు. కథలో ఇదొక భాగం మాత్రమే. ఫుట్ బాల్ తో మొదలైన కథ నిజాంపై పోరాటంగా మారుతుంది. నటీనటుల పర్ఫార్మెన్స్, టెక్నికల్ టీమ్ ఛాంపియన్ ని నడిపించాయి.

నటీ నటులు:
శ్రీకాంత్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన రోషన్ ఇప్పటికే తనని తాను నిరూపించుకున్నాడు. మొదటి సినిమా నిర్మలా కాన్వెంట్ లో నటనతో ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా నిలిచిన రోషన్ పెళ్లిసందడితో ఆకట్టుకుని లాంగ్ గ్యాప్ తరువాత ఛాంపియన్ తో వచ్చి అదరగొట్టాడు. ఫుట్ బాల్ ప్లేయర్ గా, లవర్ బాయ్ గా, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసాడు. యాక్షన్ సీన్స్ లో కూడా అద్భుతంగా నటించాడు. రోషన్ కి చాంపియన్ లో ఫుల్ మార్క్స్ వేయొచ్చు. రోషన్ స్క్రీన్ ప్రెజెన్సీ కూడా బాగుంది. రోషన్ కి జోడీగా నటించిన మలయాళీ బ్యూటీ అనశ్వర రాజన్ కూడా తెరపై అందంగా, అమాయకంగా ఉంది. అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంది. కుర్రహీరోలకి అనశ్వర బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్ లో తన అభినయంతో మెప్పించింది. 30 ఏళ్ళ తర్వాత ఛాంపియన్ తో రీఎంట్రీ ఇచ్చిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి బైరాన్ పల్లి ఊరి పెద్దగా మెప్పించారు. నెగిటివ్ షేడ్స్ లో సంగీత్ ప్రతాప్ నటన బాగుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో ప్రకాష్ రాజ్ ఆశ్చర్యపరిచారు. మురళీ శర్మ, అర్చన, మిగతా నటీనటులు పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు స్పెషల్ సాంగ్ లో మెరిసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

టెక్నికల్ :
ఛాంపియన్ మూవీకి టెక్నికల్ టీమ్ ప్లస్ అయ్యింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పడిన కష్టం తెరపై అడుగడుగునా కనిపిస్తోంది. మొత్తం సినిమా సెట్స్‌ పై ఆధారపడి తీసిందే. కానీ ఆర్టిఫీషియల్ గా అనిపించకుండా చాలా న్యాచురల్ గా ఉండేలా లొకేషన్స్ తీర్చిదిద్దారు. మిక్కి జే మేయర్ సంగీతం హాయిగా ఉంది. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకి మరింత హెల్ప్ అయ్యింది. విజువల్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. వార్ ఎపిసోడ్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్

నటీ నటులు
విజువల్స్
సంగీతం , పాటలు
ఆర్ట్ డిపార్ట్మెంట్

మైనస్ పాయింట్స్

స్లో నేరేషన్
ట్విస్ట్స్ లోపించటం

You May Like This
- Advertisment -spot_img

Most Popular