చిత్రం: దండోరా
దర్శకత్వం: మురళీకాంత్
కథ – రచన: మురళీకాంత్
నటీనటులు: శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందుమాధవి, మౌనికా రెడ్డి, మనికా చిక్కాల, రాధ్య, అదితి భావరాజు తదితరులు .
నిర్మాతలు: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
సంగీతం: మార్క్ కె.రాబిన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శాఖమూరి
ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి
బ్యానర్: లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్
విడుదల తేదీ: 25 డిసెంబరు 2025
రేటింగ్: 2.5/5
సీనియర్ హీరో శివాజీ లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘దండోరా’. శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ లో నటనకి స్కోప్ ఉన్నపాత్రలు, పవర్ ఫుల్ విలన్ రోల్స్ ఎంచుకుంటున్నాడు. #90 స్ మిడిల్ క్లాస్ తో హిట్ కొట్టిన శివాజీ , తరువాత కోర్టు మూవీతో తన మార్క్ విలనిజం తో ‘మంగపతి’ పాత్రని హైలెట్ చేసాడు. ఇప్పుడు దండోరా లో కూడా మంగపతి ని గుర్తు చేసే పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా శివాజీ గురించి దండోరా మూవీ గురించి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ జరుగుతోంది. మొత్తానికి దండోరా సినిమా క్రిస్మస్ సంధర్భంగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. దండోరా మూవీ ఎలా ఉంది ? శివాజీ పాత్ర ఏంటి ? ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
అగ్ర కులానికి చెందిన శివాజీకి విపరీతమైన కుల పిచ్చి. ప్రాణం కంటే కులమే ఎక్కువన్నట్టు ఉంటాడు. శివాజీకి విష్ణు (నందు), సుజాత (మణిక) అనే కొడుకు కూతురు ఉంటారు. సుజాత అదే గ్రామానికి చెందిన తక్కువ కులానికి చెందిన రవి (రవికృష్ణ)తో ప్రేమలో పడుతుంది. ఇది భరించలేని తండ్రి కుల పెద్దలతో కలిసి రవిని శిక్షిస్తాడు. ఈ విషయంలో తండ్రిని వ్యతిరేకిస్తూ కొడుకు విష్ణు శివాజితో మాట్లాడటం మానేస్తాడు. అంతే కాదు తండ్రిని అసహ్యించుకొంటూ అతనికి దూరంగా ఉంటాడు. రాను రాను శివాజీ తాను చేసిన తప్పుకి పశ్చాత్తాప పడుతూ కుమిలి కుమిలి మరణిస్తాడు. కూతురు సుజాత ప్రేమించిన రవికి శివాజీ ఎలాంటి శిక్ష వేయించాడు. కూతురు, కొడుకు దూరం కావడంతో శివాజీ లో వచ్చిన మార్పేంటి ? శివాజీ మరణం తర్వాత జరిగిన పరిణామాలు కథని ఎలా నడిపించాయి. గ్రామ సర్పంచ్ (నవదీప్) పాత్ర ఏంటి ? ఫైనల్ గా శివాజీ మరణం గ్రామంలో ఎలాంటి మార్పులు తెచ్చింది అనేది దండోరా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ఇంటర్ కాస్ట్ లవ్ స్టోరీస్ గతం లోను చాలా వచ్చాయి. చాలా చూసాం. ఈ కథ కూడా రొటీన్. కానీ కేవలం ప్రేమ కథ గురించి ప్రస్తావించకుండా , చావు తరువాత కూడా మనిషిని కులం ఎలా వేరు చేస్తుందో ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. సిటీల్లో ఉండే వారికీ ఈ అంతరాలు తెలియక పోవచ్చు కానీ పల్లెటూర్లలో ఇప్పటికీ కులాల వారీగా స్మశానాలు ఉండటం సర్వ సాధారణం. దర్శకుడు మురళీ కాంత్ ఇదే విషయాన్ని లోతుగా చూపించాడు. అయితే ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అగ్రకులానికి చెందిన ‘శివాజీ’ ఈ కథలో బాధితుడుగా కనిపిస్తాడు. ఫస్టాఫ్ సాగదీసినట్లు అనిపించినా కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ తో చాలా సందేహాలకు తెరపడుతుంది. సెకండాఫ్‌లో కూడా కొంత నిదానంగా సాగినా కొన్ని సీన్లు హైలెట్ గా అనిపిస్తాయి. శివాజీ, బిందుమాధవి మధ్య వచ్చే సీన్లు స్లో గా ఉన్నా కథకి టర్నింగ్ తెచ్చాయి. శివాజీ చనిపోయాక అసలు కథ మొదలవుతుంది. దర్శకుడి పాయింట్ లవ్ స్టోరీ కాదు అన్నిటికి కులం ఎలా అడ్డంకి అవుతుందో చివరికి చావుకి కూడా కులం అడ్డంకి గా మారింది అని దండోరా లో చెప్పాడు. బలగం సినిమా పిండప్రదానం చుట్టూ నడిచినట్లు ‘దండోరా’ అంత్యక్రియలు చుట్టూ నడిచే కథ. శివాజీ చనిపోయిన తరువాత ఊరిలో దహన సంస్కారం చేయకుండా అతని కులమే అడ్డుకుంటుంది. చివరికి పరిష్కారం కూడా దర్శుకుడు ‘దండోరా’ లో చూపించాడు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెదక్‌లో జరిగిన కథగా మొదలుపెట్టి 2019 వరకూ జరిగిన సంఘటనల్ని కళ్లకి కట్టారు. ఒక సీన్ లో శివాజీ పాత్ర చెప్పిన ‘కల్లు మత్తు కాదు కదా సార్.. రాత్రి తాగింది పొద్దుగాల దిగినీకీ. కులం మత్తుసార్.. టైమ్ పట్టింది’ అనే చిన్న మాట ప్రేక్షకుడిని ఆలోచనలో పడేస్తుంది.
నటీ నటులు:
‘దండోరా’ కథకి ప్రాణం పోశారు నటీ నటులు. దండోరా కథలో కనిపించే ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకువెళ్తుంది. ఒక్క పాత్ర కూడా వేస్ట్ అనిపించేలా ఉండదు. ఎవరికీ వారే ఈ కథలో నటించలేదు జీవించారని చెప్పొచ్చు. ‘కోర్టు’ లో మంగపతి పాత్రలో అలరించిన శివాజీ దండోరా లో మరొకసారి అదరగొట్టారు. ఈ పాత్రలో శివాజీని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేము. నిజానికి ‘కోర్ట్’ సినిమా కంటే ముందే దండోరా పాత్రకి ఓకే చెప్పారని, కానీ దండోరా వెనకపడిందని సమాచారం. మా ఇంటి ఆడబిడ్డ కావాల్సి వస్తుంద్రా కొడకల్లారా అన్నప్పుడు కానీ, పొలంగట్లలో మన కులం కానీ వాడు మన బిడ్డతో మాట్లాడతున్నాడేంట్రా అని అతన్ని తరిమితిరిమి కొట్టే సీన్ లు అన్నీ మంగపతిని గుర్తు చేస్తాయి. వేశ్యగా నటించిన బిందుమాధవి పాత్రలో మ్యాజిక్ బాగుంది. శ్రీలత పాత్ర వేశ్య అయినా చాలా పవిత్రంగా అనిపిస్తుంది. ఊరి ప్రెసిడెంట్ గా నటించిన నవదీప్ కూడా ఆ పాత్రకి ప్రాణం పోసాడు. పంచె కట్టు, కళ్లకి కూలింగ్ గ్లాస్ లు, బుల్లెట్ బండి కనిపిస్తూ డిఫరెంట్ గా ఉన్నాడు. చాలా రోజుల తరువాత నవదీప్ కి మంచి పాత్ర పడింది. ఆ పాత్రకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణకి విరూపాక్ష తరువాత మంచి పాత్ర దొరికింది. కథని మలుపుతిప్పే పాత్రలో రవి కృష్ణ కనిపించాడు. శివాజీ కొడుకుగా నందు పాత్ర బాగుంది. ఈ సినిమా నందుకి ఎంతో కొంత గుర్తింపు తెచ్చిపెడుతుంది. నందు నటన చాలా మెచ్యూర్డ్ గా ఉంది. ఇలా తెరపై కనిపించే ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉండటంతో పాటు అవన్నీ శివాజీ పాత్రకి లింక్ చేయడం బ్యాలెన్స్డ్‌గా ఉంది.
టెక్నికల్ :
టెక్నికల్ టీమ్ కూడా ‘దండోరా’కి ప్లస్ అయ్యింది. మార్క్ కే రాబిన్ అందించిన మ్యూజిక్ కథకి కరక్ట్ గా సెట్ అయ్యింది. శివాజీ వచ్చే సీన్‌లలో ఆ పాత్రని హైలెట్ చేస్తూ ఇచ్చిన బీజీఎమ్ సూపర్ గా ఉంది. ఎమోషనల్ సీన్‌లను కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు. వెంకట్ ఆర్ శాఖమూరి కెమెరా వర్క్ సూపర్ గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్ మెంట్ కష్టం తెరపై కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్
నటీ నటులు
బలమైన ఎమోషన్స్
క్లైమాక్స్
సామాజిక స్పృహ
మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
రొటీన్ లవ్ స్టోరీ
ఫైనల్ వర్దిక్ట్ : సమాజాన్ని తట్టిలేపే ‘దండోరా’



