ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. సురభి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి హీరోయిన్ ఎవరనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరపడినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘8 వసంతాలు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్ ‘ఎల్లమ్మ’లో దేవిశ్రీ ప్రసాద్‌కు జోడీగా నటించనున్నట్లు సమాచారం.
ఈ పాత్ర కోసం ఇప్పటికే అనంతికతో ఫోటోషూట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఫోటోషూట్‌లో ఆమె లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌పై చిత్ర బృందం సంతృప్తి వ్యక్తం చేయడంతో హీరోయిన్గా ఆమెను దాదాపు ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే అనంతిక ‘ఎల్లమ్మ’లో హీరోయిన్గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీంతో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ‘ఎల్లమ్మ’ ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగా.. దేవిశ్రీ ప్రసాద్, అనంతిక కాంబినేషన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.





