టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘KING100’. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ ప్రారంభమై చాలాకాలం అయినప్పటికీ ఇప్పటివరకు పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వని మేకర్స్.. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు.
నాగార్జున వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘మనుషుల్లో రెండు రకాలు.. ఒకరు డబ్బున్నోళ్లు, ఇంకొకరు లేనివాళ్లు. డబ్బు లేనప్పుడు నన్ను అందరూ లూజర్‌లా చూశారు. డబ్బు ఉన్నప్పుడు ‘దే కాల్ మీ ది కింగ్’..’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. డబ్బు కంటే తనకున్న గుర్తింపే మరింత శక్తివంతమైనదని చెప్పే ఆయన పాత్రను ఈ గ్లింప్స్‌లో పవర్‌ఫుల్‌గా పరిచయం చేశారు.
గ్లింప్స్‌లో నాగార్జున లుక్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా నాగార్జున స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక చివర్లో నాగార్జున ఓ చిన్నారిని ఎత్తుకుని కనిపించడం ఆసక్తిని మరింత పెంచింది. ఆ చిన్నారి ఎవరు? ఆమెకు నాగార్జున పాత్రకు ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.
గ్లింప్స్‌ను బట్టి చూస్తే.. ఓ సాధారణ వ్యక్తి నుంచి డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తిగా నాగార్జున పాత్ర ఎదిగే క్రమంలో ఎదురైన పరిస్థితులు, అతని ప్రయాణం చుట్టూనే కథ సాగనున్నట్లు తెలుస్తోంది. అయితే అసలు కథ ఎలా ఉండబోతుందనేది సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.
ప్రస్తుతం ‘KING100’ గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. గ్లింప్స్‌లో నాగార్జునను చూసిన అభిమానులు.. ఈ సినిమాతో కింగ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించడం ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.





