మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుని భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు.
చిత్ర యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 23 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. దీంతో మెగా అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కేవలం చిత్రబృందం మాత్రమే హాజరవుతుందా? లేక ప్రత్యేక అతిథులు కూడా పాల్గొంటారా? అనే విషయంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పెద్ది చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతూ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది.






