నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ప్రస్తుతం NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ తాజా షెడ్యూల్ ముంబైలో కొనసాగుతోంది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇది ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ కథ అని, బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరిగింది.
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించరని తెలుస్తోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగినా, ఇందులో దేశభక్తి ప్రధాన అంశంగా ఉండబోతుందట. దేశభక్తి, యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుతో రూపొందుతున్న ఈ కథలో బాలయ్య పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఈ తరహా కథాంశాలతో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో NBK111 పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో కాకుండా సింగిల్ రోల్‌లోనే కనిపించనున్నారని తెలుస్తోంది. కథ మొత్తం ఆయన పాత్ర చుట్టూనే తిరిగేలా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. త్వరలోనే టైటిల్‌తో పాటు మరిన్ని కీలక అప్‌డేట్స్‌ను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.





