నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం NBK-111 పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్‌బస్టర్ కావడంతో, కొత్త సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
మొదట ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా ప్లాన్ చేసినట్లు సమాచారం. హీరోయిన్‌గా నయనతార పేరు కూడా ప్రకటించారు.. అయితే తాజా టాక్ ప్రకారం, స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.
కథలో మార్పులు రావడంతో పాటు డేట్స్ సమస్యల కారణంగా నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నయనతార స్థానంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని కాజల్‌ను సంప్రదించగా, ఆమె కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
ఇప్పటికే బాలయ్య-కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి మంచి విజయాన్ని అందుకుంది. వీరిద్దరి జోడీ ప్రేక్షకులకు నచ్చడంతో, ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఒకవైపు బాలయ్య, మరోవైపు గోపీచంద్ మలినేని.. ఇప్పుడు కాజల్ కూడా జత కలవడంతో ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అవుతుందని నందమూరి అభిమానులు నమ్ముతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.





