HomeMovie News Teluguఅనిల్ రావిపూడికి దిల్ రాజు ఆఫర్..

అనిల్ రావిపూడికి దిల్ రాజు ఆఫర్..

హైదరాబాద్‌లో జరిగిన LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా, విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర వేడుకకు దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు.. ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా, నటుడిగా మంచి విజయాలు సాధించాడని ప్రశంసించారు. అలాగే, అలాంటి టాలెంట్ ఉన్న వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరని పేర్కొన్నారు.

ఇక్కడే ఒక ఆసక్తికర ప్రకటన చేస్తూ.. అనిల్ రావిపూడి ప్రతిసారి కథ చెప్పడానికి వస్తే, నువ్వు హీరో మెటీరియల్ అని చెబుతుంటాను. ఒకవేళ నువ్వు హీరోగా సినిమా చేస్తే, ఆ సినిమాను నేనే నిర్మిస్తాను అని స్టేజ్‌పైనే ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్‌ను హీరోగా పరిచయం చేస్తూ సీనయ్య అనే సినిమాను దిల్ రాజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఆయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక త్వరలో అనిల్ రావిపూడితో కూడా హీరోగా ఒక ప్రాజెక్ట్ చేయడానికి దిల్ రాజు ఆసక్తి చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు LIK సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సినిమా విడుదల తర్వాత ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular