కన్నడ స్టార్ హీరో యష్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తగా మారింది. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకుని యష్ నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదల వాయిదా పడింది.
మొదట ఈ సినిమాను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
చిత్రబృందం విడుదల చేసిన ప్రకటనలో, “టాక్సిక్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కన్నడతో పాటు ఇంగ్లీష్ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. ఎన్నో ఏళ్ల కష్టాన్ని మార్చి 19న మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. కానీ మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు మా గ్లోబల్ రిలీజ్ ప్లాన్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. అందుకే ప్రేక్షకులు, భాగస్వాముల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం” అని పేర్కొన్నారు.
పరిస్థితులు త్వరలో సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని, అందుకే సినిమాను జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. “మీ ప్రేమ, సహనానికి ధన్యవాదాలు. త్వరలో థియేటర్లలో కలుద్దాం” అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ చిత్రంలో యష్ హీరోగా నటించడమే కాకుండా కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా కావడంతో విదేశాల్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘కేజీఎఫ్’ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యష్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Toxic : A Fairy Tale for Grown-Ups – in Cinemas Worldwide on 4 June 2026 pic.twitter.com/TlLgyzrKsF
— Yash (@TheNameIsYash) March 4, 2026





