ఫోక్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్కు సంబంధించిన వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఈశ్వర్ సాయి భార్య శరణ్య దాడి చేసిందని ఆరోపిస్తూ మాధురి రాథోడ్ వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
తన ఫిర్యాదులో శరణ్య తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ అకారణంగా దాడి చేసిందని మాధురి రాథోడ్ ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తనకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించడమే కాకుండా, తన ఐఫోన్ను కూడా తీసుకెళ్లారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
అలాగే సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని మాధురి పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
కాగా, ఇటీవల వేములవాడలోని ఓ లాడ్జిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి ఉన్న సమయంలో శరణ్య అక్కడికి చేరుకున్న ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో శరణ్య, మాధురి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు ఆ వీడియోల్లో కనిపించింది.
ఈ ఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పాటు సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అనంతరం తాము రాజీకి వచ్చామని, ఇకపై ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ఎవరూ షేర్ చేయవద్దని శరణ్య ఓ ఇంటర్వ్యూలో కోరింది. అయితే తాజాగా మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు కావడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.





