హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న కొత్త సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా మూవీ టీమ్ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించింది.
#VenkyAnil5, #NKRAR2 అనే వర్కింగ్ టైటిల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి ‘బావ-బామ్మర్ది సౌజన్యంతో’ అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు.
టైటిల్ రివీల్ కోసం మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. ఈ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన ‘అప్పుల అప్పారావు’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ వీడియోను ప్రారంభించారు. అనంతరం హీరోలు, హీరోయిన్లు దర్శకుడు అనిల్ రావిపూడిని సినిమా టైటిల్ ఏంటని అడుగుతారు.
దానికి అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ అని చెప్పడంతో, అది సినిమా రిలీజ్ డేట్ అని హీరోలు భావిస్తారు. తాము అడిగింది విడుదల తేదీ కాదని, సినిమా టైటిల్ అని చెప్పడంతో అక్కడ సరదా గందరగోళం నెలకొంటుంది. చివరకు ‘జనవరి 12 విడుదల’నే సినిమా టైటిల్ అంటూ అనిల్ రావిపూడి అధికారికంగా రివీల్ చేయడంతో వీడియో ముగుస్తుంది.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన ఈ సినిమాను సమర్పిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
సంక్రాంతికి వచ్చే మన సినిమా పేరు… ☺️
— Anil Ravipudi (@AnilRavipudi) August 19, 2026
"జనవరి 12 విడుదల" – బావ బామ్మర్ది సౌజన్యంతో 🤩https://t.co/N7Sxo2q55l#January12Vidudala Grand Release worldwide for SANKRANTHI on JANUARY 12th 2027 💥 pic.twitter.com/pca7NIzWl9





