టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆమెపై హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ఇటీవల అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ‘జై శ్రీరామ్’ పేరుతో కొందరు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని, సనాతన ధర్మం పేరును కొందరు దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ఆమెపై విమర్శలు గుప్పించారు.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో అనసూయ మరో వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను హిందూ మతాన్ని లేదా హిందువులందరినీ ఉద్దేశించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. మతం పేరుతో తప్పుదారులు పడుతున్న కొందరి గురించే తాను ప్రస్తావించానని చెప్పారు. తాను శ్రీరాముడి భక్తురాలినని, తన కుమారుడికి హనుమంతుడి పేరు కూడా పెట్టానని వెల్లడించారు.
అయితే ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతపరమైన అంశాలపై ప్రజా ప్రతినిధులు, సినీ ప్రముఖులు మరింత బాధ్యతాయుతంగా స్పందించాలని వారు కోరారు.
ఇదిలా ఉంటే, అనసూయ గతంలో కూడా పలు సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలిచారు. మహిళల హక్కులు, సామాజిక సమస్యలు, సమకాలీన అంశాలపై సోషల్ మీడియా వేదికగా తరచూ స్పందిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.





