చిత్రం: విశ్వనాథ్ & సన్స్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
కథ – రచన: వెంకీ అట్లూరి
నటీనటులు: సూర్య, మమితా బైజు, రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్, వైవా హర్ష, యోగిబాబు తదితరులు
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్,
సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి,
ఎడిటర్: నవీన్ నూలీ,
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
విడుదల తేదీ: 14 ఆగస్ట్ 2026
ఐక్లిక్ న్యూస్ రేటింగ్: 3/5
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి అన్ని భాషల్లో ఫాన్స్, ఫాలోవర్స్ ఉన్నారు. కానీ గత కొంతకాలంగా వరస ప్లాప్స్ సూర్య కెరియర్ ని దెబ్బతీశాయి. లేటెస్ట్ గా వచ్చిన ‘కురుప్పు’ హిట్ తో సూర్య కెరియర్ కి పాజిటీవ్ వైబ్స్ వచ్చాయి. అందుకే విశ్వనాథ్ & సన్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ‘లక్కీ భాస్కర్’ లాంటి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కావటం కూడా ఈ సినిమాకు మరింత హైపు పెంచింది. ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజైన ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ ఎలా ఉంది ? సూర్య మరొక సాలిడ్ హిట్ కొట్టాడా? సూర్య ఫాన్స్ ఆశలు నెరవేరాయా? అన్నది ఈ రివ్యూ లో చూద్దాం.
కథ:
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) శ్రీమంతుడు, మోస్ట్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్, ఒలంపిక్స్ లో షూటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. ఇన్ని మంచి లక్షణాలున్న సంజయ్ 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సోలోగా ఉండిపోతాడు. వారసుడు కావాలన్న తల్లి నిర్మలమ్మ (రాధిక శరత్ కుమార్) కోరికను కాదనలేక అమెరికా వెళ్లి సరొగసి ద్వారా ఒక కొడుకును కంటాడు. తరువాత కొంతకాలానికి ఆ కొడుకు అభయ్‌కి బోన్ మ్యారో రిప్లేస్‌మెంట్ సర్జరీ అవసరం అవుతుంది. అందుకే సంజయ్ మళ్ళీ అమెరికా వెళ్లి సరోగసి తల్లి అయిన మ్యాడీ (మమితా బైజు)ని వెతికి కలుస్తాడు. అమెరికాలో ఉన్న మ్యాడీ బోన్ మ్యారో డోనర్ గా ఇండియాకు వస్తుంది. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు. కానీ సంజయ్ తీరు తెన్నులు, వ్యక్తిత్వం, మంచితనం చూసి ప్రేమలో పడుతుంది మ్యాడీ. 40 ఏళ్ళ సంజయ్ తో 20 ఏళ్ళ మ్యాడీ ప్రేమలో పడటం, ఏజ్ గ్యాప్ కారణంగా మ్యాడీ లవ్ ప్రపొజల్‌ను సంజయ్ రిజెక్ట్ చేయటం జరుగుతుంది. అసలు సంజయ్ పెళ్లి చేసుకోకుండా సోలోగా మిగిలిపోవటానికి కారణం ఏంటి ? సంజయ్ జీవితంలో తండ్రి పాత్ర ఏంటి? తల్లి నిర్మల కోసం సంజయ్ తన జీవితాన్ని ఎందుకు త్యాగం చేశాడు? సరోగసి ద్వారా వారసుడిని కన్నతరవాత సంజయ్‌కు ఎదురైన సమస్యలు? సరోగసి మదర్ మ్యాడీతో సంజయ్ రిలేషన్ షిప్ ఏంటి? చివరికి సంజయ్‌తో మ్యాడీ పెళ్లి జరిగిందా? విశ్వనాథ్ & సన్స్ పూర్తి కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సూర్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘గజినీ’ మూవీలో పాత్ర సంజయ్ రామస్వామి. సెంటిమెంట్ గా అందులో సంజయ్ పేరునే విశ్వనాథ్ & సన్స్ లో హీరోకి పెట్టాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మన సాంప్రదాయాలు, రిలేషన్స్, తల్లి-కొడుకుల మధ్యనున్న అనుబంధం, ఎమోషన్స్ చుట్టూ కథ నడుస్తుంది. ఈ కథ కొత్తదేమీ కాదు. రొటీన్ కథే కానీ కొంచెం కొత్త పాయింట్ తో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసాడు దర్శకుడు. బలమైన ఎమోషన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. నవ్విస్తూ , ఏడిపిస్తూ ఆడియన్స్ బోర్ ఫీల్ అవకుండా కథ కథనాలు నడిపించాడు. సంజయ్ విశ్వనాధ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించటం తో సినిమా ప్రారంభమవుతుంది. నెక్స్ట్ సంజయ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, బిజినెస్ మెన్ గా ఎదిగిన తీరు, జీవితం లో సాధించిన విజయాలు, అమ్మ కోరిక మేరకు సరోగసి ద్వారా బిడ్డని కనటం అన్నీ చక చకా జరిగిపోతాయి. బోన్ మ్యారో కోసం సరోగసి మదర్ మ్యాడీ ఇండియాకు రావడంతో అసలు కథ మొదలవుతుంది. మ్యాడీ చేసే అల్లరి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.
ఇంకో వైపు సంజయ్ కి తల్లి నిర్మలకిమధ్య్ వచ్చే ఎమోషనల్ సీన్స్ గుండెలని పిండేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ తరువాత సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఫస్ట్హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కథ మంచి ఎంగేజింగ్ గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కొన్ని, కొన్ని సీన్స్ సాగదీత లా ఉన్నాయి. క్లైమాక్స్ పెద్దగా ఆకట్టుకోలేద్దని చెప్పొచ్చు. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్‌తో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ అన్న కాన్సెప్ట్ ని చాలా కన్విన్సింగ్ చెప్పగలిగారు దర్శకుడు. లాజిక్స్ మిస్ అవ్వకుండా సినిమాని నడిపించడంలో దర్శకుడు ప్రతిభ కనపుడుతోంది. సెకండ్ హాఫ్‌లో వెంకీ అట్లూరీ మార్క్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. సూర్య-మమితా బైజుల మధ్య కెమిస్ట్రీ బాగుంది.
నటీ నటులు:
సూర్యనటనకి వంకలు పెట్టడానికి లేదు. సూర్యకి ఎలాంటి పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం చేస్తాడు. విశ్వనాథ్ & సన్స్ లో కూడా సూర్య నటన అద్భుతంగా ఉంది. సూర్యకి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. గజినీలో సంజయ్ రామస్వామిని మరిపించేలా ఉంది విశ్వనాథ్ లో సూర్య నటన. ఎమోషనల్ సీన్లలో సూర్య ప్రేక్షకులతో కంట నీరు తెప్పించేసాడు. రొమాంటిక్ ఎక్సప్రెషన్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. యాక్షన్ సీన్లలో కూడా ఆకట్టుకున్నాడు సూర్య. ప్రేమలు సినిమాతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న మమితా బైజు ఈ సినిమాతో మరొకసారి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. సూర్యతో పోటి పడి మ్యాడీ పాత్రలో ఒదిగిపోయింది. అల్లరి పిల్లగా, ఎమోషనల్‌గా, రొమాంటిక్ గా మమితా తన నటనతో ఆకట్టుకుంది. మమిత చాలా ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తూ మ్యాడీ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది. మమిత తప్ప ఇంకెవరు చేసినా ఆ పాత్రకి అంత ప్రాధాన్యత వచ్చేది కాదేమో. రాధిక, రవీనా టాండన్, నాజర్ ల నటన కూడా ఈ కథకి బలం చేకూర్చింది. మిగతా నటీ నటులు కూడా గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు. అన్నీ పాత్రలకి నటనకి స్కోప్ ఉండటం గమనార్హం.
టెక్నికల్:
ఈ సినిమాకి దర్శకుడు వెంకీ అట్లూరి తెరవెనక హీరో అని చెప్పొచ్చు. సింపుల్ అండ్ హార్ట్ టచింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నవ్విస్తూనే కన్నీళ్లు కూడా పెట్టించే సీన్స్‌తో మెప్పించాడు. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం బాగుంది. కథకి అతికినట్టుగా ఉంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. పాటలు స్క్రీన్ మీద బాగున్నాయి. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ ఆ రిచ్ నెస్ కనిపిస్తోంది. ఎడిటింగ్ విషయంలో కొంచెం శ్రద్ద పెట్టి ఉంటె బాగుండేది.
ప్లస్ పాయింట్స్
సూర్య , మమిత
నటీ నటులు
కథ, కథనం
టెక్నికల్
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్
స్లో నెరేషన్
క్లైమాక్స్
ఫైనల్ వర్దిక్ట్ : ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “విశ్వనాథ్ & సన్స్”





