టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి చిన్న వయసులోనే సినీ, సంగీత రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులకు పరిచయమైన సుకృతి, తన సహజ నటనతో ఆకట్టుకుని జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రంలో నటనకు గాను ఆమెకు ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు కూడా దక్కింది.
నటనతో పాటు సంగీతంలోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న సుకృతి, ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన సంగీత కార్యక్రమంలో ప్రధాన గాయనిగా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఆమె మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకుంది.
అమెరికాలోని ప్రముఖ బర్క్‌లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సుకృతి వేణికి ‘ఎన్‌సెంబుల్ ఎక్సెలెన్స్ అవార్డు’ లభించింది. అంతేకాకుండా అదే విద్యాసంస్థలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు పూర్తి స్కాలర్‌షిప్‌ను కూడా ఆమె సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా 272 మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ ఎంపిక ప్రక్రియలో పాల్గొనగా, కేవలం 14 మందికి మాత్రమే ఫుల్ స్కాలర్‌షిప్ లభించింది. అందులో సింగర్స్ విభాగం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా సుకృతి వేణి నిలవడం విశేషం.
సుకుమార్ కుమార్తె సాధించిన ఈ ఘనతపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సుకృతి వేణి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.





